మధుమిత, శివ, వరుణ్ ప్రధాన పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'లజ్జ'. బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాత. ఈ చిత్రం లోగో లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ జరిగింది. ఈ సందర్భంగా..
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ''1940 లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన దర్శకుడు నరసింహ నంది మరో వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇలాంటి దర్శకుడ్ని కాపాడుకోగలిగితేనే ఇండస్ట్రీలో మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఒక భార్య యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేదే ఈ సినిమా'' అని చెప్పారు.
దర్శకులు నరసింహ నంది మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని రొమాంటిక్ మూవీగా చిత్రీకరించాను. ప్రతి అమ్మాయి పెళ్ళైన తరువాత తన భర్త ప్రేమ తనకే సొంతం కావాలని కలలు కంటుంటుంది. భర్తను దగ్గర్నుంచి ప్రేమను పొందలేకపోయిన తన మనసుకు దగ్గరగా లేకపోయినా, తన ఆలోచనలు అర్ధం చేసుకోలేకపోయినా అలాంటి సందర్భాల్లో అమ్మాయి ఆలోచనలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, అనేది ఈ చిత్ర కథ. తన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే పాత్రలో నటి మధుమిత చాలా అధ్బుతంగా నటించింది. మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. మధుమిత లేకపోతే ఈ సినిమా చేసేవాడ్ని కాదు. అన్ని ఎమోషన్స్ ఉన్న కమర్షియల్ సినిమా'' అని చెప్పారు.
నిర్మాత తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ''స్టొరీ చెప్పగానే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. చాలా చక్కగా చిత్రీకరించారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.
మధుమిత మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించాను. ఇదొక ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిం. సుశీల అనే మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో నటించాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సుక్కు, శివ, మహంతి, పి.ఎల్.కె.రెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సహనిర్మాతలు: పి.ఎల్.కె.రెడ్డి, పాశం వెంకటేశ్వరులు, కె.రవిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బుజ్జి, ఎ.శ్రీనివాస్, కృష్ణ, బ్రహ్మవలి, కెమెరా: ఎస్.మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్: వి.నాగిరెడ్డి, సంగీతం: సుక్కు, పాటలు: వనమాలీ, నిర్మాత: బూచేపల్లి తిరుపతి రెడ్డి, రచన-దర్శకత్వం: నరసింహ నంది.