Advertisementt

సుక్కు జీవితాన్ని రాస్తాడు: ఎన్టీఆర్!

Mon 28th Dec 2015 03:48 PM
nannaku prematho audio launch,ntr,sukumar,devisriprasad,rakul preeth singh  సుక్కు జీవితాన్ని రాస్తాడు: ఎన్టీఆర్!
సుక్కు జీవితాన్ని రాస్తాడు: ఎన్టీఆర్!
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలిసి బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను హరికృష్ణకు అందించారు. ఈ సందర్భంగా..

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''25 సినిమాలు పూర్తి చేశాను. నా కెరీర్ లో ఇన్ని సినిమాలు చేస్తానని అనుకోలేదు. అసలు నటుడ్ని అవుతానని అనుకోలేదు. నాన్నగారు నాకు ధైర్యం చెప్పి సినిమా ఇండస్ట్రీ కు పంపారు. నా మీద నాకు నమ్మకం కలిగేలా చేశారు. నాన్నగారు మా ముగ్గురు అన్నాదమ్ముళ్ళకు ఒక్కటే చెప్పేవారు.. ''కింద పడండి.. చావు వరకు వెళ్ళండి.. కానీ పోరాడండి'' అని. ఏరోజు మమ్మల్ని పిరికి పందల్లా పెంచలేదు. తాత పేరు, నాన్న పేరు చెప్పుకొని బ్రతికే విధంగా మమ్మల్ని పెంచలేదు. ఇక ఈ సినిమా విషయానికొస్తే సుక్కు జీవితం ఈ సినిమా. తను కథలు రాయడు.. జీవితాలు రాస్తాడు. సుక్కు నాన్నగారు కొనఊపిరిలో ఉండగా ఈ సినిమా కథ పుట్టింది. సుకుమార్ గారి నాన్న కథ ఇది. ఇలాంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో మరొకడు పుట్టడేమో.. ఇలాంటి ఓ గొప్ప కథతో నా 25వ సినిమా రావడం నా అద్రుష్టం. దేవిశ్రీ అంత బాధలో ఉన్న తన వలన సినిమా లేట్ కాకూడదని వచ్చి పని చేశాడు. అసలు తను చేసిన పని ఎవరికి అర్ధం కావట్లేదు. అంత కష్టంలో మరొకరు ఇలా సినిమా కోసం పని చేసేవారే కాదు. బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. జగపతి బాబు గారు నా హృదయానికి దగ్గరైన మనిషి. సినిమాలో ప్రతి నాయకుడిగా నటించి కథకు ప్రాణం పోశాడు. జగపతిబాబు గారు లేకుండా 'నాన్నకు ప్రేమతో' ఊహించలేం. ఆయన లేకుండా ఈ సినిమానే లేదు. నా 25వ సినిమా ఏదో సాధారణమైన సినిమా కాదు. మన తల్లి తండ్రులు అందరికి మేమిచ్చే నీరాజనం ఈ 'నాన్నకు ప్రేమతో'' అని చెప్పారు.

హరికృష్ణ మాట్లాడుతూ.. ''కనిపించని దేవుడు కంటే కనిపించే ప్రేక్షకదేవుళ్ళే మాకు దేవుళ్ళు. నందమూరి అభిమానులకు మేము ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తున్నాం. కాని వారు మా వంశం బాగుండాలని, మేము అభివృద్ధిలో ఉండాలని అనుకుంటారు. నా పెద్ద కొడుకు కీర్తిశేషులు జానకి రామ్, నా రెండో కొడుకు కళ్యాణ్ రామ్ కి పేర్లు మా నాన్నగారే పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం తారక్ రామ్ అని నేనే పేరు పెట్టాను. 'విశ్వామిత్ర' షూటింగ్ సమయంలో నాన్నగారు నీ మూడో కొడుకు ఎలా ఉన్నాడు..? ఒకసారి తీసుకొని రా.. అని చెప్పారు. తీసుకువెళ్ళగానే నీ పేరేంటని తారక్ ను అడిగారు. తారక్ చెప్పగానే 'నీది నా అంస నా పేరే నీకుండాలని' చెప్పి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారు. 'విశ్వామిత్ర' హిందీ వెర్షన్ లో నాన్నగారితో కలిసి తారక్ కూడా నటించాడు. ప్రజలకు ఎనలేని సేవ చేశారు. ఆయన నాకే కాదు ఈ రాష్ట్రానికే తండ్రి. తారకు ఇది 25వ సినిమా. పటాస్, టెంపర్ లానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. ఈ ఆడియో కార్యక్రమం సత్యమూర్తి గారికి అంకితం చేయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ''కొడుకు తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ఏం చేసాడనేదే ఈ 'నాన్నకు ప్రేమతో'. నేను ఇప్పటివరకు మా నాన్న లాంటి మంచి కొడుకును చూడలేదు. మా తాతగారికి మా నాన్నగారు ఎంతో చేశారు. మేము మా నాన్నగారికి అంతగా చేయలేకపోతున్నామని బాధగా ఉంది. 35 సంవత్సరాలు తన తండ్రికే జీవితాన్ని అంకితం చేసిన అలాంటి కొడుకు కడుపున మేము పుట్టడం మా అద్రుష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో తమ్ముడు చాలా కొత్తగా కనిపిస్తాడు. అధ్బుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సినిమాలో గెటప్ కోసం తను ఎంతగానో కష్టపడ్డాడు. సుకుమార్ గారు సినిమా బాగా తీశారు. 2016లో 'నాన్నకు ప్రేమతో' బెస్ట్ ఆల్బం గా నిలుస్తుంది'' అని చెప్పారు. 

సుకుమార్ మాట్లాడుతూ.. ''మొదటిసారి దేవిశ్రీ ఏడవడం చూశాను. తను అంత బాధలో ఉన్న వచ్చి వర్క్ చేశాడు. ఈ కథ వెనుక ఉన్న పూర్తి ఎమోషన్ మా నాన్నగారిదే. తారక్ మాస్ గా కనిపించినా క్లాస్ మనసున్న మనిషి. అధ్బుతమైన సింగర్. ఒక ఆల్బం లో మొత్త పటాలు పాడగలిగే సత్తా ఉన్న హీరో. 'నానకు ప్రేమతో' టైటిల్ ఉన్న హార్ట్ బీట్ టచ్ బావుందని అందరూ నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. నిజానికి ఆ ఐడియా తారక్ ది. సింపుల్ హ్యూమన్ బీయింగ్. రాజేంద్ర ప్రసాద్ గారి 'లేడీస్ టైలర్' సినిమా షూటింగ్ చూసి సినిమాల్లోకి రావాలనుకున్నాను. ఆయన లేకుంటే నేను డైరెక్టర్ అయ్యేవాడ్ని కాదు. ఆయనకు డైరెక్ట్ చేయడం నా కల. జగపతి బాబు గారు ఎప్పటికి అందంగానే ఉంటారు. ఈ సినిమా కోసం ప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు'' అని చెప్పారు.  

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ''నేను తారక్ ను ముద్దుగా తలైవా అని పిలుస్తుంటాను. ప్రసాద్ గారితో చాలా సినిమాలు చేశాను. మా నాన్నగారు నాకొక అందమైన జీవితం ఇచ్చారు. గత ముప్పై సంవత్సరాలుగా ఆయన హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మా అమ్మ జాగ్రత్తగా నాన్నను చూసుకుంది. ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు నన్ను ఎక్కువ సమయం హాస్పిటల్ లో ఉండనిచ్చేవారు కాదు. నాన్న 'వెళ్ళరా.. మంచి ట్యూన్స్ చెయ్యు.. పని పక్కన పెట్టొద్దని' చెప్పేవారు.. తోటి టెక్నీషియన్ ను అప్రిషియేట్ చేయగలిగిన వాడే నిజమైన టెక్నీషియన్ అని ఆయన చెప్పేవారు. ఈ ఆడియో నాన్నగారికి అంకితం ఇవ్వడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు. 

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''హీరోయిన్ గా కంటే నటిగా నన్ను నేను నిరూపించుకునే సినిమా ఇది. సుకుమార్ గారు నాలో ఉన్న నటిని గుర్తించారు. తారక్ మంచి డాన్సర్, డెడికేటెడ్ పెర్సన్. ఆఫ్ ది స్క్రీన్ తనొక మంచి తండ్రి. దేవిశ్రీ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. తనతో మళ్ళీ వర్క్ చేయాలనుంది. విజయ్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. ఈ సినిమాలో మొదటిసారిగా నేను డబ్బింగ్ చెబుతున్నాను. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

జగపతిబాబు మాట్లాడుతూ.. ''ఈ సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు సుకుమార్ ఇంటలిజెన్స్ లెవెల్ అర్ధమయ్యింది. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే.. సుకుమార్ గారి ఇంటలిజెన్స్ కు కమర్శియాలిటీ యాడ్ చేసి ఈ సినిమా తీశారు. సుకుమార్ షూటింగ్ మొదటిరోజు నాకు మీరి ఇంకా హీరోగానే కనిపిస్తున్నారు.. విలన్ గా ఎలా చూపించాలని అడిగారు. హీరోను విలన్ గానే కాదు ఆయన విలన్ ను హీరోగా కూడా చూపించగలరు. తారక్ లో ఉన్న ఎనర్జీ లెవెల్స్, తన ఫ్రెండ్షిప్ వేరు. క్రమశిక్షణతో ఉంటాడు. చాలా టాలెంటెడ్ పెర్సన్. బాగా అల్లరి చేస్తాడు. యూనిట్ అందరిని బాగా ఆటపట్టిస్తాడు. ఇప్పుడు నాన్నకు ప్రేమతో అయింది. అల్లుడికి ప్రేమతో కోసం రెడీ అవ్వండి'' అని చెప్పారు. 

కొరటాల శివ మాట్లాడుతూ.. ''ఈ సినిమా నా సొంత సినిమాలాగా ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ గారితో సినిమా అంటేనే చాలా టెన్షన్ గా ఉంటుంది. ఎలాంటి డైలాగ్స్ రాయాలని జాగ్రత్తగా రాసుకుంటున్నాను. 'నాన్నకు ప్రేమతో' చూసి రాత్రింబవళ్ళు కథ రాసుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాను'' అని చెప్పారు. 

వక్కంతం వంశీ మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాం. 2016 లో ఖచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాను. ఆయన నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' సినిమా మంచి సక్సెస్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ''సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టనున్నాం. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపిస్తాడు. దేవిశ్రీప్రసాద్, సుకుమార్, ఎన్టీఆర్ మంచి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

చంద్రబోస్ మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ మొదటి సినిమా నుండి నేను తనకు పాటలు రాస్తూనే ఉన్నాను. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. 'డోంట్ స్టాప్' నాకు బాగా ఇష్టమైన పాట. ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, ఎన్టీఆర్ కు థాంక్స్'' అని చెప్పారు.

భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. ''సుకుమార్ గారితో మొదటిసారి వర్క్ చేస్తున్నాను. మంచి పాట రాసే అవకాశం వచ్చింది. శ్రుతి మించని ఓ రొమాంటిక్ సాంగ్ రాశాను. యూనిట్ అందరికి నా శుభాకాంక్షలు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కె.ఎస్.రామారావు, జయేష్ రంజన్, సర్కార్, నవీన్, విజయ్, జానీ మాస్టర్, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement