చైతు శాంతారాం ప్రధానపాత్రలో గణేష్ క్రియేషన్స్ పతాకంపై వంశీ మునిగంటి దర్శకత్వంలో లండన్ గణేష్ నిర్మిస్తున్న చిత్రం 'పడమటి సంధ్యారాగం'. లండన్ లో అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ''విదేశాలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్న కొందరు స్నేహితులు కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో సినిమా చేశారు. జంధ్యాల గారు డైరెక్ట్ చేసిన పడమటి సంధ్యారాగం సినిమా టైటిల్ పెట్టుకోవడానికి ఎన్నో గట్స్ కావాలి. సినిమాలో పాటలు బావున్నాయి. ఖచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.
దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ''ముప్పై సంవత్సరాల క్రితం ట్రెండ్ సెట్ చేసిన పడమటి సంధ్యారాగం సినిమా టైటిల్ ను మా సినిమాకు పెట్టుకున్నాం. ప్రస్తుతం విదేశాలలో ఉన్న తెలుగు వారి కల్చరల్ డిఫరెన్సెస్ గురించి తెలియజేసే సినిమా ఇది. ఇందులో సున్నితమైన ప్రేమకథ, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ చిత్రం ఎన్నారైల గుండెచప్పుడు అని చెప్పొచ్చు'' అని చెప్పారు.
నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను లండన్ లో ప్రతి వారానికొకసారి చిత్రీకరించేవాళ్ళం. ఇలా ఎనిమిది నెలల పాటు షూట్ చేశాం. డైరెక్టర్ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను రూపొందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ మాట్లాడుతూ.. ''మంచి అవుట్ పుట్ వచ్చింది. సినిమాకు మ్యూజిక్ అందించడంతో పాటు నేనొక పాట కూడా పాడాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంధ్యా రవి, జితేంద్ర, దొరై, చైతు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.ప్రసాద్, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, డైలాగ్స్: వంశీ మునిగంటి, కిట్టు, మ్యూజిక్ డైరెక్టర్: కేశవ్ కిరణ్, కో ప్రొడ్యూసర్స్: సలాం, రమేష్, ధీరజ్, ఫిరోజ్, నిర్మాత: లండన్ గణేష్, రచన-దర్శకత్వం: వంశీ మునిగంటి.