సమయానికి సెట్‌కి రాడనే ఓ పెద్ద కంప్లయింట్ అల్లరి నరేష్‌పై ఉంది. మోహన్‌బాబు కూడా ఆ కంప్లయింట్ గురించి విని సినిమాకి ముందు నరేష్‌ని ఎంచుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాడట. ఆ విషయాన్ని ఇటీవల జరిగిన `మామ మంచు అల్లుడు కంచు` ఆడియో వేడుకలో స్వయంగా చెప్పుకొచ్చాడు మోహన్‌బాబు. మామూలుగా అయితే సక్సెస్‌ల్లో ఉన్నంతవరకు ఇలాంటి కంప్లయింట్లు పెద్దగా ప్రభావం చూపవు. అదే బండి రివర్సయిందనుకోండి. వ్యవహారం మొత్తం మారిపోతుంది. అలాంటప్పుడే మనిషి తప్పకుండా మారాలి. తన తప్పుల్ని సవరించుకొనే ప్రయత్నం చేయాలి. లేదంటే అసలుకే ఎసరొస్తుంది. కానీ నరేష్‌కి మాత్రం ఆ విషయం ఇంకా బోధపడటం లేదు. క్రమశిక్షణకి మారుపేరైన మోహన్‌బాబు ఉంటాడు కాబట్టే `మామ మంచు అల్లుడు కంచు` సెట్‌కి నరేష్ సమయానికి వెళ్లేవాడేమో తెలియదు కానీ... ఆయనలో పాత బుద్ధులు మాత్రం అలాగే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. తనలోని బద్ధకాన్ని వదలడం లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇటీవల తన ఆఫీసులో పెట్టిన విలేకరుల సమావేశానికి రెండు గంటలు ఆలస్యంగానైనా హాజరు కాకపోవడమే అందుకు ఓ ఉదాహరణ. మామ మంచు అల్లుడు కంచు ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకి నరేష్ తన ఆఫీసులో విలేకర్లతో సమావేశం కావల్సి వుంది. అయితే 11 కాదు కదా 12 అయ్యింది, ఒంటి గంట అయ్యింది. అయినా అతీగతి లేదు. ఇదేంటని ప్రెస్‌మీట్‌కి పిలిచిన పీఆర్వోని అడిగితే అతను కూడా ఇదిగో అదిగో అంటూ నిర్లక్ష్యపు సమాధానం. దీంతో మీడియాకి చిర్రెత్తుకొచ్చింది. ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయింది. అంత జరిగాక కూడా నరేష్ నుంచి కొంచెం కూడా స్పందన లేదు. గంట ఆలస్యంగా వచ్చినందుకు ఇదివరకు అల్లు అర్జున్‌లాంటి స్టార్ కథానాయకుడిని బాయ్‌కాట్ చేసింది మీడియా. కానీ తన తప్పుని తెలుసుకొని అల్లు అర్జున్ స్వయంగా మీడియాకి సారీ చెప్పి మళ్లీ ఇంటర్వ్యూకి ఆహ్వానించాడు. నరేష్ అది చేయకపోగా... మంగళవారం మళ్లీ విలేకర్ల సమావేశం అంటూ కబురు పెట్టారు. నరేష్ మీడియా దగ్గరే ఇలా ఉంటే ఇక నిర్మాతల దగ్గర ఎలా వ్యవహరిస్తాడో ఊహించొచ్చు. వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా అడుగులు వేయాల్సింది పోయి... ఇలా మరింత నిర్లక్ష్యంతో వ్యవహిరిస్తే అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవడం తప్ప మరొకటి కాదు. మరి టైమ్ అంటే టైమ్ అని చెప్పే మోహన్‌బాబు వరకు ఈ విషయం వెళ్లిందో లేదో తెలియదు. ఒకవేళ ఆయనకి తెలిస్తే మాత్రం కన్నెర్రజేయడం ఖాయం. మోహన్‌బాబుకి సమయపాలన అన్నా, మీడియా అన్న చాలా గౌరవం. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఆయన అస్సలు క్షమించరు. ఈ వ్యవహారంలో పీఆర్వోల నిర్లక్ష్యం కూడా ఉందన్న అభిప్రాయాలు మీడియా నుంచి వ్యక్తమవుతున్నాయి.