పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'ముసుగు'
త్రినాథ్ పంపన, మనోజ్ కృష్ణ, హర్ష కృష్ణమూర్తి, జెస్సీ, పూజశ్రీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'ముసుగు'. శ్రీకరబాబు దర్శకత్వం వహిస్తున్నారు. వేద ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా..నిర్మాత దగ్గుబాటి వరుణ్ మాట్లాడుతూ 'మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రమిది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాం. ఇటీవల గోవాలో చేసిన చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తైంది. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు.
'రొమాన్స్, క్రైమ్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా లావిష్‌గా వచ్చేందుకు ఎంతో సహకరించారు. అవుట్‌పుట్ చూసి ఆయన బ్యానర్‌లో మరో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని దర్శకుడు శ్రీకరబాబు చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు,పాటలు: గంగోత్రి విశ్వనాథ్, ఎడిటింగ్: అనిల్ బొంతు, సంగీతం: నవనీత్‌చారి, సి.ఎన్.ఆదిత్య, స్క్రీన్‌ప్లే: దివాకర్ బాబు, కెమెరా- దర్శకత్వం: శ్రీకరబాబు.