''ఆ ఒక్కటి అడక్కు'' చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయమయ్యి 'ఖడ్గం' సినిమాలో తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ.. ప్రేక్షకులను అలరించిన కామెడీ నటుడు పృధ్వీ. రీసెంట్ గా ఆయన నటించిన 'బెంగాల్ టైగర్' సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో పృధ్వీ 'హాస్యం.. హాస్యం..' అంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
టి.వి లో మూడు షిఫ్ట్స్ చేసేవాడ్ని..
నేను ఇండస్ట్రీకు వచ్చి 16 సంవత్సరాలు అయింది. టి.వి లో రోజుకు మూడు షిఫ్ట్స్ చేసేవాడ్ని. రోజు బాగానే గడిచిపోయేది. కాని గుమాస్తా ఉద్యోగంలా ఉందని సినిమాల్లో ట్రై చేయాలని చెన్నై వెళ్లాను. అచ్యుత్ నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరం ఒకసారే చెన్నై వెళ్లాం. అచ్యుత్ కు వెంటనే ఓ తమిళ చిత్రంలో ఆఫర్ వచ్చేసింది. నేను ఇ.వి.వి.సత్యనారాయణ గారిని కలవడానికి వారి ఇంటికి వెళ్లాను. ఆయన వెంటనే రావు గోపాలరావు గారి మేనల్లుడి పాత్రకు సరిపోతావని చెప్పి 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ వైజాగ్ లో ఇరవై రోజులు జరిగింది. రోజుకు 500 రూపయలు చొప్పున తీసుకునేవాడ్ని. సినిమా బాగా ఆడింది. ఆ సినిమా వెంటనే వారసుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి.
ఫ్యామిలీ సపోర్ట్ లేదు..
మాది వెస్ట్ గోదావరిలోని తాడేపల్లిగూడెం. నాకు ఇరవై సంవత్సరాలకే పెళ్లయింది. ఇంట్లో వారంతా సినిమాలు ఎందుకు..? ఎం.ఎ చేసావు కదా.. ఏదైనా ఉద్యోగం చూస్కో అనేవారు. నేను సినిమాలో నటించడం వారికిష్టం లేదు. ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండేది కాదు. నాకు కూడా ఇండస్ట్రీలో బ్రేక్ రావడానికి సుమారుగా 12 సంవత్సరాలు పట్టింది.
మా కోడలు బెస్ట్ క్రిటిక్..
నాకు ఇద్దరు పిల్లలు. నా కొడుకు ప్రేమ వివాహం చేసుకొని స్కాట్ లాండ్ లో ఉంటున్నాడు. నా కోడలు బెస్ట్ క్రిటిక్. నా సినిమాలన్నీ చూస్తుంటుంది. నిన్న బెంగాల్ టైగర్ సినిమా చూసి.. బ్రతికున్నంత కాలం ఇలా అందరిని నవ్విస్తుండండి.. అని చెప్పింది. నా కూతురికి రీసెంట్ గా పెళ్లి చేశాను.
పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతా..
నేను ఈ ఫీల్డ్ నే నమ్ముకున్నాను. ఎవరికీ ఎవరు శాశ్వతం కాదు. నేను ఎవరి దగ్గర నుండి అవకాశాలు లాక్కోలేదు. ఇండస్ట్రీ నాకు మొదటినుండి తిండి పెడుతూనే ఉంది. ఇప్పుడైతే పంచభక్షపరమాన్నాళ్ళు పెడుతోంది. 'లౌక్యం' సినిమాతో మంచి అవకాశాలు వస్తున్నాయి. 'బెంగాల్ టైగర్' తో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాన్ గారు ఒకసారి 'ఇస్తే తీస్కో.. అంతేకాని లాక్కోకు' అని చెప్పారు. ఆ విషయంలో ఆయననే ఫాలో అవుతాను.
రవితేజ గారు ఫోన్ చేసారు..
ఈ సినిమా చూసిన వెంటనే రవితేజ గారు ఫోన్ చేసి నా ఫైట్లు, డాన్సులు పక్కన పెడితే.. నువ్వు మాత్రం ఇరగదీసేసావ్ పృధ్వీ.. అని చెప్పారు. కష్టపడి పైకి వచ్చాం.. అహంకారాన్ని పక్కన పెట్టి ఇలానే ఉండు అని రవితేజ గారు చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది.
అదే నా తపన..
కైకాల సత్యనారాయణ గారి లాగా ఎలాంటి పాత్రలు వచ్చినా నటిస్తూ ఉండాలనేదే నా తపన.
సిక్స్ ప్యాక్ చేస్తున్నా..
తమిళంలో అజిత్ గారు హీరోగా నటిస్తున్న చిత్రంలో అవకాశం వచ్చింది. దాని కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
పెద్ద హీరోతో పెద్ద సినిమా ఒకటి ఉంది. అది కాకుండా సౌఖ్యం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పూరి గారి సినిమా ఒకటి, చుట్టాలబ్బాయి సినిమా, వైశాఖం సినిమా, సునీల్ గారి సినిమాల్లో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.