కమల్ హాసన్ గారితో కలిసి పని చేయడం నాకొక పెద్ద కల. 'చీకటి రాజ్యం' చిత్రంతో ఆ కల నేరవేరిందంటూ.. మధుశాలిని విలేకర్లతో ముచ్చటించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మధుశాలిని మాట్లాడుతూ.. ''నవంబర్ 20న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా సంవత్సరాల తరువాత కమల్ హాసన్ గారు తెలుగులో నటించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. డైరెక్టర్ రాజేష్ గారు కమల హాసన్ గారితో ఏడు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చాలా బాగా డైరెక్ట్ చేసారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో ప్రతిది కథలో భాగంగా ఉంటుంది. కమల్ హాసన్ గారికి నా మధ్య ఉండే లిప్ కిస్ కూడా కథ డిమాండ్ చేసింది కాబట్టే పెట్టారు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా ఆ సన్నివేశం కన్విన్సింగ్ గానే అనిపించింది. కమల్ హాసన్ గారితో కలిసి పని చేయడమనేది నా కల. ఈ చిత్రంతో నా కల నెరవేరింది. నిజానికి ఈ సినిమా ఆడిషన్స్ అవుతున్నాయని నా స్నేహితురాలు నటి అయిన ప్రియానంద్ చెప్పింది. అప్పటికే నా పాత్ర కోసం చాలా మందిని షార్ట్ లిస్టు చేసారు. అయితే కమల్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్లి కలిసాను. ఆయన వెంటనే నన్ను ఎంపిక చేసారు. కమల్ గారు ప్రతి సినిమాను మొదటి చిత్రంగా భావించి పని చేస్తారు. సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్, ఇన్ పుట్స్ ఇవ్వాలో అంతా.. చేస్తారు. నటులకు ఫ్రీడం ఇస్తారు. ప్రస్తుతం నేను మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. నాకు స్క్రిప్ట్ నచ్చాలి. అప్పుడే నటిస్తాను. తెలుగులో నాకు అలాంటి ఆఫర్స్ రావట్లేదు. తమిళంలో నాకు నచ్చే స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందుకే తమిళ చిత్రాలకు ఓకే చెబుతున్నాను'' అని చెప్పారు.