హీరోగా వరస ఓటములతో గిన్నీస్ బుక్కులో స్థానం దక్కించుకుంటాడేమో అన్న అపవాదు నుండి టాలివుడ్ కొత్త లవర్ బాయ్ అవతారం ఎత్తడంలో హీరో నితిన్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇష్క్ ఇచ్చిన బ్రేక్ సద్వినియోగం చేసుకొని గుండె జారి గల్లతయ్యిందే, హార్ట్ ఎటాక్ చిత్రాలతో హ్యాట్ ట్రిక్ సాధించిన నితిన్ తన కెరీర్లో చేసిన అతి పెద్ద ఘోర తప్పిదంగా అఖిల్ చిత్రం నిలబడిపోతుంది. హీరోగా బండి బాగా లాగుతున్న సమయంలో అక్కినేని వంశాంకురాన్ని పరిచయం చేసే భారాన్ని ఎత్తుకొవాలనుకున్న నితిన్ పోకడను ఇప్పుడు అందరూ తప్పు పడుతున్నారు. అటు నితిన్ డబ్బులు పోయి, ఇటు అఖిల్ సాధిస్తాడనుకున్న పేరు ప్రతిష్టలు రాకపోవడంతో రెంటికీ చెడ్డ రేవులా తయారయింది అఖిల్ సినిమా పరిస్థితి. ఈ సునామీ దెబ్బ నుండి కోలుకోవడానికి నితిన్ ఎంత సమయం తీసుకుంటాడు అన్నది ఇప్పట్లో అంచనా వేయలేని ప్రశ్న. అన్ని లెక్కలు ముగిసాక, నితిన్ మరోసారి నిర్మాత అవతారం ఎత్తుతాడా లేక బుద్ధి తెచ్చుకొని హీరోగా కంటిన్యూ అవుతాడా అన్నది తేలాల్సి ఉంది.