Advertisement

'ఎలుకా మజాకా'ఆడియో విశేషాలు!

Sat 07th Nov 2015 03:53 PM
eluka majaka audio release,vennela kishore,relangi narsimharao  'ఎలుకా మజాకా'ఆడియో విశేషాలు!
'ఎలుకా మజాకా'ఆడియో విశేషాలు!
Advertisement

డా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, పావని ప్రధాన పాత్రల్లో నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ళ నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ఎలుకా మజాకా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను రాజేంద్రప్రసాద్, గిరిబాబు లకు అందించారు. ఈ సందర్భంగా..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''ప్రస్తుతం జరుగుతున్న ఫంక్షన్స్ అన్ని జాతర మాదిరి జరుగుతున్నాయి. స్టేజీ మీదకు కుప్పలు, తెప్పలుగా జనాలు వస్తున్నారు. ఆస్కార్ ఫంక్షన్స్ కనుక చూస్తే స్టేజీ మీద అవార్డు ఇచ్చేవారు, తీసుకునే వారు తప్ప మరెవరు ఉండరు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది మనవాళ్ళ ధోరణి. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ఎలుకా మజాకా ఆడియో కార్యక్రమం మాత్రం ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లా జరుగుతుంది. చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని రేలంగి ఈ సినిమా చేస్తున్నాడు. నిజానికి అతను సినిమాలు ఇక చేయకూడదు అనుకున్నాడు. ప్రస్తుతం చిన్న సినిమాలు చేయడం చాలా కష్టంగా మారింది. ఒకవేళ మొదలు పెట్టినా మధ్యలో ఆగిపోతున్నాయి. కష్టపడి సినిమా పూర్తి చేసినా.. థియేటర్లు దొరకడం లేదు. అలాంటి దారుణమైన స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే 'ఎర్రబస్సు' సినిమా షూట్ చేస్తున్న సమయంలో రేలంగి నాకు ఈ సినిమా కథ చెప్పాడు. బావుంది సినిమా చేయమని చెప్పాను. ఇందులో ఎలుకకు గొప్ప సెంటిమెంట్ ఉంది. ఎలుకదే ప్రధాన పాత్ర. మామూలు గ్రాఫిక్స్ చేయడం వేరు, ఓ క్యారెక్టర్ ను క్రియేట్ చేసి గ్రాఫిక్స్ చేయడం వేరు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందించిన సత్య ను నా 'ఎర్రబస్సు' చిత్రంతో పరిచయం చేసాను. తరువాత 'కాకి' సినిమాకు కూడా పని చేసాడు. అతని పనితనం నచ్చి 'అఖిల్' చిత్రానికి కూడా ఎన్నుకున్నారు. 100, 200 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఉన్న బడ్జెట్ లో గ్రాఫిక్స్ చేయడం గొప్ప విషయం. నా దృష్టిలో పెద్ద చిత్రాలు ఎప్పుడైనా.. రిలీజ్ కావచ్చు. చిన్న సినిమాలు మాత్రం పండగలకు రిలీజ్ అయితే ఎందరికో లైఫ్ దొరికినట్లవుతుంది. రీసెంట్ గా దసరా కు రిలీజ్ అయిన 'కంచె, రాజు గారి గది, కొలంబస్' మూడు చిత్రాలు హిట్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఆ చిత్రాలకు పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు మంచి భవిష్యత్తు దొరికింది. తమిళంలో చిన్న చిత్రాలు, పెద్ద చిత్రాలు కొనడానికి బయ్యర్స్ ఉంటారు కాని తెలుగులో మాత్రం ఇప్పటివరకు లేరు. కాని ఈ సంవత్సరం నుండి తెలుగులో కూడా చిన్న చిత్రాలు కొనడానికి బయ్యర్స్ ముందుకొస్తున్నారు. వెన్నెల కిషోర్ మంచి టైమింగ్ ఉన్న నటుడు. నా అనుభవంలో కామెడీ పాత్రలో నటించడమనేది చాలా కష్టమైన విషయమని భావిస్తాను. ముఖకవలికలతో నవ్వించగలిగే నటుడు రేలంగి మాత్రమే. రేలంగి తో సినిమా తీసి నష్టపోయిన ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు లేరు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు నా అభినందనలు'' అని చెప్పారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో హీరోగా ఎవరిని ఎన్నుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు వెన్నెల కిషోర్ అయితే బాగా చేస్తాడని చెప్పడంతో ఆయన నటించిన సినిమాల డివిడిలు తెప్పించి చూసాను. నా చిత్రానికి తనైతే యాప్ట్ అనిపించి గురువు గారికి(దాసరి నారాయణరావు) వెన్నెల కిషోర్ తో సినిమా చేస్తున్నాని చెప్పాను. వెంటనే ఆయన మంచి కామెడి టైమింగ్ ఉన్న నటుడు.. బాగా నటిస్తాడని చెప్పారు. ఈ చిత్రానికి టెక్నీషియన్స్ కోపరేషన్ మర్చిపోలేనిది. కొత్త నిర్మాతలు వారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''మంచి కాన్సెప్ట్ ఉన్న వినోదాత్మక చిత్రం. రేలంగి గారి సెకండ్ ఇన్నింగ్స్ లో వస్తున్న మొదటి చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం'' అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''సినిమా ఇండస్ట్రీలో 100 మందికి పైగా సక్సెస్ అయిన శిష్యులు ఉన్న దర్శకుడు దాసరి గారు మాత్రమే. రేలంగి, జంధ్యాల గారికి కావాల్సిన హీరోల్లో నేను, నరేష్ మొదట ఉంటాం. రేలంగి గారు డైరెక్ట్ చేసిన 75 చిత్రాల్లో 35 సినిమాలు నేనే చేసాను. ఆయనతో ఎప్పటినుండో ట్రావెల్ అవుతూ వస్తున్నాను. నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం ఆయన సినిమాల్లో నటించడమే. ఇండియాలో ఉన్న పెద్ద స్క్రీన్ ప్లే రైటర్స్ లో రేలంగి గారు ఒకరు. రేలంగి గారు డైరెక్ట్ చేసిన ఏ సినిమా కూడా బోర్ కొట్టదు. నిర్మాతల డైరెక్టర్ ఆయన. వెన్నెల కిషోర్ తో కొన్ని సినిమాల్లో నటించాను. సీనియర్స్ కు బాగా గౌరవం ఇస్తాడు. ఈ సినిమాతో వెన్నెల కిషోర్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. రేలంగి గారు విరామం లేకుండా మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. ''మంచి స్క్రిప్ట్ ఉన్న చిత్రం. చరిత్రలో యానిమల్స్ తో తీసిన సినిమాలన్నీ మంచి హిట్స్ ను సాధించాయి. అలానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

గిరిబాబు మాట్లాడుతూ.. ''రేలంగి కి కామెడి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. 75 సినిమాలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. సెట్ లో చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేస్తాడు. రేలంగి ఇంటిపేరులోనే హాస్యం ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ బల్లేపల్లి మోహన్ మాట్లాడుతూ.. ''ఒసేయ్ రాములమ్మ' చిత్రానికి కోరస్ పాడాను. వందేమాతరం శ్రీనివాస్ గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసాను. ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. రీరికార్డింగ్ చేసినప్పుడు సినిమా చూసాను. మంచి కామెడి ఫిలిం. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వెన్నెల కిషోర్, పావని, సగిలి సత్యనారాయణరెడ్డి, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మూలకథ: మురళీ మోహనరావు, స్క్రీన్ ప్లే: దివాకర్ బాబు, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: నాగేంద్ర కుమార్, ఎడిటర్: నందమూరి హరి, మ్యూజిక్: బల్లేపల్లి మోహన్, గ్రాఫిక్స్: సగిలి సత్యనారాయణరెడ్డి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement