Advertisementt

ఆ నలుగురు ఉగ్రవాదులు కాదు:చంద్రమహేష్!

Thu 05th Nov 2015 04:44 PM
red alert movie,chandra mahesh,mahadev,sreeramreddy  ఆ నలుగురు ఉగ్రవాదులు కాదు:చంద్రమహేష్!
ఆ నలుగురు ఉగ్రవాదులు కాదు:చంద్రమహేష్!
Advertisement
Ads by CJ

హెచ్.హెచ్.మహాదేవ్, అంజనా మీనన్ జంటగా పి.ఎన్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీలయ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాంరెడ్డి( లేట్) నిర్మించిన సినిమా 'రెడ్ అలర్ట్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్రమహేష్, హీరో మహదేవ్ విలేకర్లతో ముచ్చటించారు. 

చంద్ర మహేష్ మాట్లాడుతూ.. ''1993 లో సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించిన 'సూపర్ పోలీస్' చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా నా కెరీర్ మొదలుపెట్టాను. ఆ చిత్ర దర్శకులు మురళి మోహన్ రావు గారి ప్రోత్సాహంతో దర్శకత్వశాఖలో మెళకువలు నేర్చుకున్నాను. నా పట్టుదల చూసి రామనాయుడు గారు, సురేష్ గారు నన్ను ఎంకరేజ్ చేసి వారి సంస్థలో ఉద్యోగిగా నియమించుకున్నారు. 'ప్రేమించుకుందాం రా' చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. 'సూపర్ హీరోస్' చిత్రంతో ఫ్లాప్ లో ఉన్న రామానాయుడు గారికి పోసాని కృష్ణ మురళి గారు రచించిన శివయ్య సినిమా కథను వినిపించాను. ఈ సినిమా గనుక హిట్ అయితే నీకు దర్శకుడిగా అవకాశమిస్తానని రామానాయుడు గారు నాకు మాటిచ్చారు. 'శివయ్య' సినిమా 100 రోజుల ఫంక్షన్ లో ఆ విషయాన్ని వెల్లడించారు. 'ప్రేయసి రావే' సినిమా కథను సిద్ధం చేసుకొని తెరకెక్కించాను. అప్పటివరకు ఫ్లాప్ లలో ఉన్న శ్రీకాంత్ మంచి బ్రేక్ ను ఇచ్చింది. ఆ సినిమా చూసిన చిరంజీవి గారు నన్ను ప్రత్యేకంగా ఇంటికి తీసుకువెళ్ళి అభినందించారు. కథ రాయమని నాకు రెండు మూడు సార్లు అవకాశాలు కూడా ఇచ్చారు. కాని మా కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు. ఆ తరువాత శ్రీహరి గారితో 'అయోధ్య రామయ్యా', 'ఒక్కడు' సినిమాలు చేసి మంచి హిట్స్ ను అందుకున్నాను. నవీన్ తో చేసిన 'చెప్పాలని వుంది' చిత్రం మేము అనుకున్న స్థాయిలో విజాయాన్నివ్వలేకపోయింది. కొత్త వాళ్ళతో 'జోరుగా హుషారుగా' సినిమాను  తీర్చిదిద్దాను. ఆ సినిమా చూసి రామోజీరావు గారు అప్రిషియేట్ చేసి మంచి రేట్ కు ఆ సినిమా కొనుక్కున్నారు. కాని ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. ఆ తరువాత చేసిన లవ్ ఇన్ హైదరాబాద్ సినిమా దర్శకుడిగా ఉన్న నన్ను రోడ్ మీదకు లాగేసింది. అపజయాలు వచ్చాయని ఎప్పుడు క్రుంగిపోలేదు. నాలో పట్టుదల వదలలేదు. శ్రీరాం రెడ్డి గారు నేను డైరెక్ట్ చేసిన సినిమాలు చూసి మనమొక సినిమా చేద్దాం.. కథ రెడీ చేసుకోమని చెప్పారు. మొదట వారి కుమారుడు మహదేవ్ స్టొరీ విని ఓకే చేసాడు. మరుసటిరోజు శ్రీరాం రెడ్డి గారికి కథ చెప్పిన వెంటనే సినిమాకు ముహూర్తం పెట్టేసారు. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన భావించారు. 2014 మర్చి 15 న షూటింగ్ మొదలు పెట్టి సెప్టెంబర్ 5 నాటికి సినిమా పూర్తి చేసాం. ఒక పాట బ్యాలన్స్ ఉంటే అది కూడా పూర్తి చేసి డిసెంబర్ 18 న సినిమాకు గుమ్మడికాయ కొట్టేసాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నాలుగు భాషల్లో.. చేయాల్సివచ్చింది. 2015 మార్చి మొదటి వారానికి, సినిమా మొదటి కాపీ రెడీ అయ్యింది. అన్ని భాషల్లో ఒకేరోజు విడుదల చేయాలనుకున్నాం. సౌత్ 800 థియేటర్లలో రిలీజ్ చేయాలని శ్రీరాం రెడ్డి గారు అనుకున్నారు. కాని ఆయన ఆకస్త్మాతుగా మరణించారు. ఆ షాక్ నుండి తేరుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. కన్నడలో మొదట ఈ చిత్రాన్ని రిలీజ్ చేసాం. ఆ తరువాత కేరళలో రిలీజ్ చేసాం. రెండు భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. వినాయకచవితికి తెలుగులో విడుదల చేయాలనుకుంటే థియేటర్లు దొరకలేదు. కన్నడ, మలయాళం కంటే తెలుగులో ఇంకా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. హైదరాబాద్ లోని ఓ చానల్ లో పని చేసే కుర్రాడు, తన నలుగురు స్నేహితులను సిటీకు రమ్మని ఆహ్వానిస్తాడు. సిటీ కు వచ్చిన ఆ నలుగురిని ఉగ్రవాదులనుకుంటారు. ఈ అంశాలతో సినిమా సాగుతుంటుంది. ఉగ్రవాదం అనేది ఎప్పటినుండో ఉన్న సమస్య. దాని కామెడీ గా ఈ సినిమాలో చూపించాం. రవి వర్మ చక్కటి మ్యూజిక్ అందించారు. ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది'' అని చెప్పారు.

మహదేవ్ మాట్లాడుతూ.. ''ఇదొక మంచి కామెడి ఎంటర్టైనింగ్ సబ్జెక్టు. రెగ్యులర్ సినిమాల్లా 5 పాటలు, ఫైట్స్, రొమాన్స్ లా కాకుండా మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఇంత చక్కటి చిత్రంతో తెలుగులో పరిచయమవ్వడం ఆనందంగా ఉంది. కన్నడ, మలయాళం లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ