సినిమా హాస్యానికి పెద్దపీట వేయడంలో తెలుగు ప్రేక్షకులకి సాటిలేరు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి డీటీఎస్ వరకు పరిజ్ఞ్యానం పెరిగినా, తెర మీద మాత్రం మనం ఎక్కువగా ఆస్వాదించేది కమెడియన్స్ చేసే విన్యాసాలే. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా విపరీతంగా బతికింది, బతుకుతుంది, కామెడీ మీదే. అలా సామాన్య ప్రజలను తమ తమ దైనందిన సమస్యల నుండి దూరంగా తీసుకెళ్ళి కాసేపు ప్రపంచాన్ని మరిచిపోయి ఆహ్లాదపరిచే ఉత్తమ హాస్యనటులున్న మన తెలుగు పరిశ్రమకి ప్రస్తుతం దుర్దశ నడుస్తోంది. ఓ దశాబ్ద కాలంగా హాస్య రంగానికి వన్నెలద్దిన మేటి నటులందరూ వరసపెట్టి కాలం చేస్తుంటే కళామతల్లి కంట, సినీ అభిమానుల కంట కన్నీరు కారుతోంది.
గత కొన్ని నెలలుగా ఏవీఎస్, ఆహుతి ప్రసాద్ మొదలు ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు ఇప్పుడు మాడా వెంకటేశ్వర రావు, కొండవలస లక్ష్మణ రావు కూడా కన్నుమూయడం మనకు తీరని లోటు. నిన్నటి తరం అత్యుత్తమ హాస్యాన్ని జల్లిన గొప్ప నటులందరూ కానరాని లోకాలకు పయనం అవుతూ ఉండడంతో, రానున్న రోజుల్లో టాలివుడ్ తీవ్రమైన హాస్యపు కొరతను ఎదుర్కొనేలా కనిపిస్తోంది. కొత్తతరం నటులు కాస్తో కూస్తో పెద్దవారులేని లోటును భర్తీ చేసే ప్రక్రియ మొదలెట్టినా, అంతటి అత్యుత్తమమైన ఆరోగ్యకరమైన కామెడీని మళ్ళీ నేటి తరానికి, రాబోయే తరాలకి అందివ్వడం అత్యాశే అవుతుంది.
ముఖ్యంగా నిన్నటి తరం వారిలో పెక్కుగా నాటక రంగానికి సేవలు అందించి రావడంతో కెమెరా ముందు సినిమాను, సంభాషనలని తమదైన శైలిలో వారు చెడుగుడు ఆడుకునేవారు. దర్శకుడికన్నా ఎక్కువ జ్ఞ్యానం ఉన్న ఇలాంటి మహానుభావులంతా అకాల మృతి చెందుతుండడం కేవలం మన దౌర్భాగ్యం. వీరందరి గైర్హాజరులో తెలుగు సినిమా భవిష్యత్తు ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరం.