హాస్యనటుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు మృతి చెందారు. అనారోగ్య కారణంగా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చేరిన కొండవలస కొంతకాలంగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో నటుడుగా పరిచయమైన కొండవలస అనతి కాలంలోనే కమెడియన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు 300 చిత్రాల్లో నటించిన కొండవలస ఆగస్ట్ 10, 1946లో జన్మించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం. చిత్రరంగానికి రాకముందు విశాఖ పోర్ట్ పనిచేసేవారు. నాటక రంగంలో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న కొండవలసని ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం ద్వారా చిత్ర రంగానికి పరిచయం చేశారు దర్శకులు వంశీ. డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్‌తో అయితే ఓకే అంటూ స్టార్ట్ అయిన కొండవలస ఎన్నో చిత్రాల్లో తన నటనతో, డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. వెయ్యికిపైగా నాటకాల్లో నటించిన కొండవలస నాటక రంగానికి సంబంధించి ఉత్తమనటుడుగా రెండుసార్లు నంది అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం వున్న హాస్యనటుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న కొండవలస మృతి పట్ల సినీ హాస్య కుటుంబం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఒక మంచి హాస్యనటుడ్ని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. కొండవలస లక్ష్మణరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటోంది సినీజోష్.