తనకి ఎలాంటి సినిమాలు నప్పుతాయో బాగా తెలుసుకొన్నాడు నిఖిల్. ఇంకేముంది? అక్కడే సగం సక్సెస్ అయిపోయాడు. నిఖిల్ ఇప్పటికీ తొలి అడుగులు వేస్తున్నట్టే. కానీ ఎంతో అనుభవమున్నవాడిలాగా పూర్తి క్లారిటీతో సబ్జెక్ట్స్‌ని చూజ్ చేసుకొంటున్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య... ఇలా నిఖిల్ చేసిన ఈ సినిమాలన్నీ కూడా థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడుకొన్న సినిమాలే. కానీ వీటి మధ్య కాస్త వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మరో కొత్త రకమైన కథతో నిఖిల్ శంకరాభరణం చేశాడు. ఈసారి కూడా క్రైమ్ థ్రిల్లర్ కథే అయినప్పటికీ ఇందులో ఎలిమెంట్స్ మాత్రం కొత్తగా, ఇదివరకు తెలుగు సినిమాకి పరిచయం లేనట్టుగా ఉన్నాయి. హిందీ బ్లాక్ బస్టర్ పాస్ గయారే ఒబామాకి అఫీషియల్ రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉదయ్ నందనవనం దర్శకుడు. కోన స్క్రిప్టు పరంగా, మాటల పరంగా సహకారం అందించాడు. మంచి బజ్‌ని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవలే ఆడియో ఫంక్షన్ జరుపుకొంది. ఈ సందర్భంగా ట్రయిలర్‌ని విడుదల చేశారు. అందులో పంచులు పేలిపోయాయి. కోన మార్క్ మాటలు సినిమా నిండా ఉన్నట్టు అర్థమవుతోంది. పృథ్వీ, సప్తగిరి, గిరి, తదితర నటులంతా హల్‌చల్ చేశారని తెలుస్తోంది. అఖిల్ ప్రేక్షకుల ముందుకు రాకపోయుంటే ఈ సినిమాని నవంబరు 11న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ అఖిల్ విడుదల పక్కా కావడంతో నిఖిల్ శంకరాభరణం ఒక వారం వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ ఎప్పుడొచ్చినా హిట్టు ఖాయం అంటూ చిత్రబృందం కాన్ఫిడెన్స్‌ని వ్యక్తం చేస్తోంది.