ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై..రాజ్ కందుకూరి, బిగ్ బెన్ సినిమాస్ (లండన్) సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ పెళ్లి చూపులు. హైదరాబాద్‌లోని అన్న పూర్ణ స్టూడియోలో నవంబర్ 1న ఈ మూవీ ప్రారంభం అయింది. విజయ్ దేవరకొండ, రీతు వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి డి.సురేష్‌బాబు క్లాప్‌నివ్వగా...అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అవసరాల శ్రీనివాస్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
రాజ్ కందుకూరి మాట్లాడుతూ...శ్రీ యష్ రంగినేనితో కలిసి చేస్తున్న మూవీ ఇది. తరుణ్‌భాస్కర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. సురేష్‌బాబు మా స్టోరీలైన్ విని చాలా బావుందని, వెంటనే చేసేయ్యమని చెప్పారు. మనం, ఉయ్యాలా జంపాలా వంటి సినిమాలు ఎలాంటి ఫ్రెష్ ఫీలింగ్ ను ఇచ్చాయో అలాంటి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది ఈ మూవీ. ఈ రోజు (నవంబర్ 1) నుండి నవంబర్ 16 వరకు తొలి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 4వరకు రెండో షెడ్యూల్, వచ్చే నెలాఖరున మూడో షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నాం. సినిమా మొత్తాన్ని 42 రోజుల్లో పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం... అని అన్నారు.
శ్రీ యష్ రంగినేని మాట్లాడుతూ...దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పిన పాయింట్ నచ్చింది. సినిమాలంటే నాకు చాలా ఇఫ్టం. రాజ్ కందుకూరితో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. యంగ్ టాలెంట్‌ని పరిచయం చేయడానికి ఈ బ్యానర్ ను పెట్టాం. మున్మందు మరిన్ని మంచి సినిమాలు చేస్తాం.. అని అన్నారు.
సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాట్లాడుతూ.. ఇది నా తొలి సినిమా. తరుణ్‌తో ఇంతకు ముందు నేను ట్రావెల్ చేశాను. సంగీతానికి స్కోప్ ఉన్న సినిమా ఇది. సంగీతంలో కొత్త ప్రయోగం చేస్తున్నాం. ఆన్ లొకేషన్‌లోనే రీరికార్డింగ్, సౌండ్ డిజైనింగ్ చేస్తున్నాం. ఇది ఎక్స్ పెరిమెంట్. టైమ్ కూడా సేవ్ అవుతుంది.. అని అన్నారు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఇన్నొవేటివ్‌గా ఏమైనా చేస్తామని చెప్పినప్పుడల్లా ఫ్రీడమ్ ఇస్తున్నారు. మంచి టీమ్ కుదిరింది. పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాం. విజయ్, రీతూ ల నటన ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ ఎన్విరాన్‌మెంట్‌లో జరిగే మోడ్రన్ లవ్ స్టోరీ ఇది. మోడ్రన్ జంట ట్రెడిషన్‌కు ఎలా విలువిచ్చారనేది కథాంశం. స్వప్నక్క, లక్ష్మీ మంచు మంచి సపోర్ట్ చేస్తున్నారు.. అని అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..కథ నచ్చింది. తరుణ్ నాకు ముందే తెలుసు. ఎవడే సుబ్రమణ్యం సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగా చేశానని మెచ్చుకున్నాడు. నాతో సినిమా చేస్తానని ఈ సినిమా స్క్రిప్ట్ చేశాడు. నేనూ, తను కలిసి నిర్మాతలను కలిశాం. ఫీల్ ఉన్న సినిమా అవుతుంది... అని అన్నారు.
ఇంకా హీరోయిన్ రీతూవర్మ, డీఓపీ నగేష్ తదితరులు ఈ పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు.