తెలుగు మీడియా టైకూన్ రామోజీరావు ఈ మధ్య కాలంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. అధికారపక్షం, విపక్షం అనే తేడా లేకుండా అన్ని రాజకీయపార్టీలు రామోజీని ప్రసన్నం చేసుకోవడానికి పాకులాడుతున్నాయి. ఫిల్మ్‌సిటీని వెయ్యి నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆరే స్వయంగా ఆర్‌ఎఫ్‌సీకి వెళ్లి రామోజీతో మూడు గంటలపాలు గడిపారు. అంతేకాకుండా ఫిల్మ్‌సిటీ తెలంగాణకే తలమానికమంటూ వేన్నోళ్లపొగిడారు. ఇక ఇప్పుడు జగన్ వంతు. పిలవని పేరంటానికి వెళ్లినట్లు జగన్ ఆర్‌ఎఫ్‌సీ ఆగమేఘాల మీద వెళ్లి ఆయనతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చలు దేని గురించి జరిగాయో.. ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే దీనికి సంబంధించి పలు ఉహాగానలు మీడియాలో వెల్లువెత్తాయి. బీజేపీకి దగ్గరకావడానికి రామోజీ సాయం జగన్ కోరారని ఓసారి, సీబీఐ కేసు బలహీన పర్చేలా చర్యలు తీసుకోవాలంటూ మరోసారి, బీజేపీ అధిష్టానం సూచన మేరకే రామోజీతో సంధికి జగన్ ప్రయత్నించారంటూ చర్చలు కొనసాగాయి. తాజాగా మరోసరికొత్త వాదన మీడియా ముందుకొచ్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటూ గతంలో టీడీపీ ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. దీన్నే నిజం చేస్తూ ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్‌లో కలవడానికి తహతహలాడుతున్నట్లు ఓ మీడియా వర్గం ప్రచారం చేస్తోంది. ఈ సంధికి మధ్యవర్తిత్వం వహించాలని రామోజీని జగన్ అడిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికితోడు వైసీపీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రావు మరోసారి రామోజీని కలవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే వైసీపీ కాంగ్రెస్‌లో కలవాలనుకుంటే దానికి రామోజీ సాయం ఎందుకని, తామే స్వయంగా చర్చలు జరపగలమని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ వాదనల్లోనూ బలం ఉన్నా.. మరి జగన్ రామోజీని ఎందుకు కలిశారో స్పష్టంగా బయటకు వచ్చే వరకూ ఇలాంటి ఊహాగానలు తప్పవేమో.