పెట్టిన పెట్టుబడికి ఎన్ని రెట్లు లాభాలు వస్తాయో లెక్కలేసుకుని సినిమా యాపారం చేస్తున్న ఈ రోజుల్లో వరుణ్ తేజ్ లాంటి మెగా కుటుంబానికి చెందిన హీరోని ఎటువంటి కమర్షియాలిటీ కోణం లేని పాత్రల్లో చూపడానికి ఇష్టపడే దర్శకులు, నిర్మాతలు దొరకడం గొప్ప విషయమే. పరమ రొటీన్ కమర్షియల్ కథలకే పరిమితమైతే ఎం కిక్కు ఉంటుంది, అందుకే మొదట్లోనే కొత్త పంథాలో వెళుతున్నానని వరుణ్ తేజ్ నిన్న విడుదలయిన కంచె సినిమాతో మరోసారి రుజువు చేసాడు.
ముకుంద లాంటి హంగులు లేని సాదాసీదా మూవీతో తెరంగేట్రం చేసిన వరుణ్ అదే తరహాలో కంచెను కూడా ఒప్పుకుని సాహసమే చేసాడు. వరుణ్ విషయంలో తండ్రిగా నాగబాబుకి తప్పకుండా ఓ స్పష్టత ఉండే ఉంటుంది. అందుకనే కొడుకు చేస్తున్న ప్రతి భిన్నమైన ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. మొదటి రెండు సినిమాలతో వరుణ్ మిగతా మెగా హీరోలకన్నా తనది సరికొత్త శైలి అని చాటుకున్నాడు. భవిష్యత్తులో కూడా అతను ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగితే పవన్ కళ్యాణ్ లాగా కొత్త ఒరవడిని సృష్టించడం ఖాయం అని విమర్శకులు గట్టిగా చెబుతున్నారు.