బాహుబలి సీక్వెల్ సినిమాల్ని భారీగా ప్లాన్ చేశాడు రాజమౌళి. బాహుబలి 2 తోపాటు 3 కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడాయన. తొలి చిత్రం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే తదుపరి రెండు చిత్రాలకి మరింత స్టార్ బలాన్ని పెంచి మరిన్ని భాషల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. బాహుబలి తొలి పార్ట్‌లో ప్రభాస్ ఒక్కడే స్టార్. కానీ రాజమౌళికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఆ సినిమా హిందీ, తమిళంలోనూ బాగా ఆడింది. ఇక తదుపరి చిత్రాలకి ఆయా భాషల్లోని స్టార్స్‌ని కూడా భాగం చేయాలని చూస్తున్నాడు. అందుకే పలువురు హిందీ, తమిళం స్టార్స్‌తో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎప్పట్నుంచో సూర్య పేరు ప్రచారంలోఉంది. బాహుబలి 2 విషయంలో సూర్య, రాజమౌళి కలిసి మాట్లాడుకొన్నారని, సూర్య నటించడానికి ఒప్పుకొన్నాడని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. బాహుబలి 2 తెరకెక్కే సమయం దగ్గర పడుతుండటంతో ఆ ప్రచారం మరింతగా ఊపందుకొంది. అయితే సూర్య మాత్రం అలాంటిదేమీ లేదని తోసిపుచ్చాడు. నేను, రాజమౌళి కలిసి మాట్లాడుకొన్నదే లేదని, బాహుబలి 2లో తాను నటిస్తున్న మాట అవాస్తవమని స్పష్టం చేశాడు. ఆ అవకాశం కోసం తానూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఒకవేళ రాజమౌళి నుంచి పిలుపొస్తే వెంటనే ఆ విషయాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పకొచ్చాడు.