అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులో చేరాలన్న కోరిక, బాహుబలి తప్ప మిగిలిన రికార్డులన్నింటికీ పాతరేయాలన్న సంకల్పం, అభిమానులని దసరా సంబరాల్లో ముంచి ఎత్తాలన్న ఎత్తుగడ, అన్నీ ఒక్కసారిగా బ్రూస్ లీ నీరుగార్చడంతో హీరో రామ్ చరణ్ ఆవేదన చెందుతున్నాడు. బాబాయి పవన్ కళ్యాణ్ పుణ్యమాని మరికొన్ని టిక్కెట్లు తెగకపోతాయా అని సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో ఉన్న పవన్ చిన్నాన్నను సైతం ప్రసన్నం చేసుకునెందుకు సిద్ధపడ్డాడు. ఇవన్ని బ్రూస్ లీ కోసమైతే మరి అతిత్వరలో ఆరంభం కానున్న తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అన్నదే అభిమానులను తొలచివేస్తున్న ప్రశ్న.
తని ఒరువన్ విజయానికి ఏకైన కారణం అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా చేసిన అద్భుత నటన. అలాగే తెలుగు రీమెక్ కోసం సురేందర్ రెడ్డి లాంటి ఫ్లాప్ దర్శకుడిని ఎన్నుకోవడం కూడా ఫ్యాన్స్ కలత చెందాల్సిన విషయమే. అతగాడు దర్శకత్వం వహించిన కిక్ 2 ఘోరమైన పరాభవాన్ని మూట గట్టుకుంది. తని ఒరువన్ తెలుగు సెట్స్ మీదకు ఇంకా వెళ్ళక ముందే బ్రూస్ లీ ఆవేదన నుండి బయటపడి పెద్ద ఆలోచన చేసి తదుపరి చిత్రాన్ని అయినా బాక్సాఫీస్ దగ్గర విజయ దుందుభి మ్రోగించే దిశగా ఆలోచిస్తే రామ్ చరణ్ భవిష్యత్తుకు మంచిది.
మెగా అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్న చరణ్ కొంచెం జాగ్రత్త పడితే కాసులు, విజయాలు అవలీలగా వాటంతట అవేగా వస్తాయి. ఈ విషయాన్ని ఎప్పుడు గ్రహించినప్పుడే గడ్డు కాలాన్ని అధిగమించగలడు.