గట్టి నమ్మకంతో అనుకున్న తేదీనే రుద్రమదేవికి పోటీగా మారి వీలయినన్ని ఎక్కువ సినిమా హాళ్ళలో విడుదలయిన బ్రూస్ లీకి చిరంజీవి చరిష్మా, రామ్ చరణ్ స్టార్ ఇమేజి పెద్దగా కలిసి రాలేదన్నది వసూళ్లు చూస్తే యిట్టె అర్థమవుతుంది. అందుకని బ్రూస్ లీ ఆక్రమించిన పెక్కు సినిమా హాళ్ళు రెండో వారానికి ఖాళీ అవుతుండడంతో రుద్రమదేవికి మళ్ళీ ఆహ్వానం రావొచ్చేమో అన్నది గుణశేఖర్ గారికి సంఘీభావం తెలిపే వారిలో ఎక్కువగా వినిపిస్తున్న వాదన.
కానీ దసరా సందర్భాన్ని పురస్కరించుకుని వస్తున్న వరుణ్ తేజ్ కంచె, ఓంకార్ రాజు గారి గది, సుమంత్ అశ్విన్ కోలంబస్ ఇంకా ప్లేయర్ వంటి చిన్న చిత్రాలకు కూడా కొద్దో గొప్పో థియేటర్లు దొరకడంతో రుద్రమ్మకు పూర్వ వైభవం కాకపోయినా ఎన్నో కొన్ని అదనపు హాళ్ళు దొరికే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే రెండో వారం దాటి మూడో వారానికి దగ్గరవుతున్న గుణశేఖర్ చారిత్రక చిత్రానికి బ్రూస్ లీ వల్ల ఎంత లాభం పొందవచ్చు అన్నది ఈ నెలాఖరుకి గానీ అంచనా వేయలేం.
కానీ బ్రూస్ లీ గనక అనుకున్న దానికన్నా ఇంకో వారం ఆలస్యంగా వచ్చుంటే రుద్రమదేవి పరిస్థితి చాలా బెటరుగా ఉండేది అన్నది అందరు ఒప్పుకునే నిజమే. జరిగిపోయిన నష్టాన్ని కొంతలో కొంత పూడ్చే ప్రయత్నం మాత్రం గుణశేఖర్ నుండి తొందరలోనే ప్రారంభం కావచ్చు.