రుద్రమదేవి కథను తెరకెక్కించాలన్న గుణశేఖర్ కలను సాకారం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. నిర్మాణానికి ఎన్నో కష్టాలు, సినిమాని రిలీజ్ చేయడానికి మరెన్నో అడ్డంకులు. వాటన్నింటినీ దాటుకొని ఎట్టకేలకు తన కలల చిత్రరాజాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు గుణశేఖర్. అయితే రుద్రమదేవి చరిత్రను అందరికీ అర్థమయ్యేలా, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తియ్యగలిగాడా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే ఈ చిత్రంలో బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ గోన గన్నారెడ్డిది. అందర్నీ దాటుకొని ఆ క్యారెక్టర్ అల్లు అర్జున్ తలుపు తట్టింది. ఈ సినిమాలో అతనిది చెప్పుకోవడానికి స్పెషల్ క్యారెక్టరే అయినా, అతని పెర్‌ఫార్మెన్స్, తెలంగాణా స్లాంగ్, అతను చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్‌లో ఉత్సాహాన్ని నింపాయి. గుణశేఖర్‌కి గోన గన్నారెడ్డి క్యారెక్టర్ అంటే మొదటి నుంచీ ఇంట్రెస్టే. ఆ ఇంట్రెస్ట్‌తోనే ఆ క్యారెక్టర్ కోసం అద్భుతమైన తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్‌ని రాయించడం, అంతకంటే అద్భుతంగా అల్లు అర్జున్ వాటిని పలకడంతో ఆ క్యారెక్టర్‌కి మరింత అందం వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి క్యారెక్టర్ గురించే చర్చించుకుంటున్నారంటే అది సినిమాకి ఎంత హైలైట్ అయిందో అర్థమవుతుంది.