కాళీచరణ్, కర్జ్, హీరో, సౌదాగర్, కర్మ, రామ్‌లఖన్, ఖల్‌నాయక్, తాళ్ వంటి సూపర్ డూపర్‌హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన లెజండరీ డైరెక్టర్ సుభాష్ ఘాయ్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సుభాష్ మంత్రి కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించే యోచనలో వున్నట్టు సుభాష్ తెలిపారు. దానికి సానుకూలంగా స్పందించిన కెటిఆర్ తమ సహకారం ఎప్పుడూ వుంటుందని హామీ ఇచ్చారు. అంతే కాకుండా తెలంగాణలోని కళాకారులకు మంచి శిక్షణ ఇచ్చి ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు సహకరించవలసిందిగా సుభాష్‌ను కోరారు కెటిఆర్. తమ ప్రభుత్వం రాచకొండ ఫిల్మ్ సిటీ గురించి సుభాష్‌కు వివరించారు కెటిఆర్. అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సుభాష్‌ఘాయ్ త్వరలోనే హైదరాబాద్‌కి తన మకాంను షిఫ్ట్ చేసే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో తాను ప్రారంభించ తలపెట్టిన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తున్నందుకు చాలా ఆనందంగా వుందని సుభాష్ అన్నారు. ఏది ఏమైనా బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అయిన సుభాష్ ఘాయ్‌లాంటి వ్యక్తి హైదరాబాద్‌లో ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తానని ముందుకు రావడం నిజంగా అభినందనీయమే.