రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను వి.వి.వినాయక్ కు అందించారు. వి.వి.వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇష్టమైన మాట బ్రూస్ లీ. తను నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా నేను చాలా సార్లు చూసాను. ఒక్క సినిమాతోనే ఎంతో పాపులర్ అయ్యాడు. ఆయన పేరుతో సినిమా చేస్తున్న రామ్ చరణ్ ధన్యుడు. ఎంటర్ ది డ్రాగన్ లానే ఈ సినిమాలో కూడా బ్రదర్,సిస్టర్ సెంటిమెంట్ ప్రాధాన్యంగా ఉంది. అందుకే చిత్ర యూనిట్ బ్రూస్ లీ టైటిల్ పెట్టినట్లున్నారు. ఈ టైటిల్ కథకు సముచితంగా, న్యాయంగా ఉంది. ఈ సినిమా ముహూర్తపు రోజునే అక్టోబర్ 16న రిలీజ్ చేస్తామని చెప్పాం. అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తున్న దాని వెనుక ప్రతి ఒక్కరి కష్టముంది. అందరిని అలరించే దిశగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా కోసం రామ్ చరం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడ్డాడు. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇలా అన్ని కోణాలను టచ్ చేసి సినిమా చేసారు. కామెడీ టైమింగ్ విషయంలో శ్రీనువైట్ల తరువాతే ఎవరైనా.. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రకుల్ చాలా రొమాంటిక్ గా ఉంది. ఈ సినిమాలో నా ఎంట్రీ కొసమెరుపు. నాకోసం ప్రత్యేకంగా సీన్ క్రియేట్ చేసారు. అవసరమా నేను నటించడం 150 వ సినిమా ఉందని చెప్పినా.. వినకుండా నేను నటించేలా చేసారు. నేను ఉన్న 5 నిమిషాలు కూడా అభిమానులకు కృతజ్ఞత చెప్పే విధంగా డైలాగ్ కూడా ఉంటుంది. అది నాకు సంతృప్తిగా అనిపించింది. నా స్టామినాకు స్పీడ్ కు ఫ్యూయల్ నా అభిమానులే అని నేను రామ్ చరణ్ కు డైలాగ్ చెప్తాను. ఆ సీన్ ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుంది. నేను నటించబోయే 150వ సినిమా గురించి నిర్మాతలైన రామ్ చరణ్, సురేఖా బ్రూస్ లీ సినిమా రిలీజ్ సమయానికి అధికార ప్రకటన చేయనున్నారు.. అని చెప్పారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎంతో క్వాలిటీతో సినిమా చేసాం. మొదటిసారిగా 5 నెలల్లో నేను సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాను. ఖర్చుకు వెనుకాడకుండా దానయ్య గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన లేకపోతే సినిమా అనుకున్న టైం కి రిలీజ్ చేసేవాళ్ళం కాదు. కోన, గోపి గారు ఈ సినిమా కోసం పని చేసినందుకు థాంక్స్. బ్రూస్ లీ సాంగ్ షూటింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అది రేపే కంప్లీట్ చేయనున్నాం. ఈ సినిమాలో కృతి, నదియ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. కృతి స్టార్ హీరోయిన్ అయిన నాకు అక్కగా నటించింది. సినిమా కథ అంతా అక్క తమ్ముళ్ళ మధ్య నడుస్తుంటుంది. నాన్నగారితో మొదటిసారి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఉన్న 5 నిమిషాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.. అని చెప్పారు
వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు షూటింగ్ లో ఉన్నారని తెలిసి అక్కడకి వెళ్లి చూసాను. అన్నయ్య మీరు నిజంగా కత్తిలా ఉన్నారు. ట్రైలర్ చాలా బావుంది. రామ్ చరణ్ ను నేను ఎప్పుడూ రాయల్ చరణ్ అంటూ ఉంటాను. నిజంగా తను రాయల్ గా కమిట్మెంట్ తో ఉంటాడు. శ్రీనువైట్ల కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. కోన, గోపి మోహన్ కాంబినేషన్ ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.
శ్రీనువైట్ల మాట్లాడుతూ.. చిరంజీవి గారు మొదట నా స్క్రిప్ట్ విని ఓకే చేసారు. చరణ్ ను నాకు ఇవ్వడంతో పాటు చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనను ఫ్యాన్స్ ఎలా ఉండాలని ఆశిస్తారో అదే విధంగా సినిమాలో చిరంజీవి గారు ఉంటారు. గోపి, కోన నాతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. ఈ సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అధ్బుతంగా చేస్తున్నాడు. ఫోటోగ్రఫీ చాలా బావుంటుంది. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు అనుకున్న సమయంలో సినిమాను రిలీజ్ చేయాలని ఎంతో కష్టపడి పని చేసారు. దానయ్య గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.. అని చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ కు మగధీరుడు రామ్ చరణ్. తన టాలెంట్ తో దినదినాభివృద్ధి చెందుతున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి గారు చిన్న క్యారెక్టర్ లో నటించారు. ఆయన షూటింగ్ లో పాల్గొన్న మూడు రోజులు నేను షూటింగ్ స్పాట్ కి వెళ్లాను. తండ్రి కొడుకులు ఇద్దరు గుర్రం మీద వస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. శ్రీనువైట్ల నాకు మంచి వెల్ విషర్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చిరంజీవి గారు తన 150వ చిత్రం తరువాత చేయబోయే చిత్రం నాతో చేస్తానని చెప్పారు. ఆయన తొందరగా 150వ చిత్రం చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
కోన వెంకట్ మాట్లాడుతూ.. 2003 నుంచి మేము మొదటిసారి గా పని చేసే హీరోల ప్రతి సినిమా పెద్ద సక్సెస్ అయ్యాయి. అలానే రామ్ చరణ్ కు కూడా ఈ సినిమా కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. చిరంజీవి గారు షూటింగ్ లో ఫస్ట్ షాట్ లో నటించి వస్తున్నప్పుడు ఆయనను చూడడానికి సిగ్గుపడ్డాను. నేను రెడీ గా ఉన్నాను మీ సంగతేంటి అన్నట్లుగా అనిపించింది. అందరు ఈ చిఎమాను ప్రేమించి జీవం పోస్తే చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చి ఆయుష్షు పోశారు.. అని చెప్పారు.
అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. మా నాన్న గారు విజయ్ కుమార్, చిరంజీవి గారితో కలిసి స్నేహం కోసం సినిమాలో నటించారు. అలానే తెలుగులో నా మొదటి సినిమా చిరంజీవి గారు కుమారుడు రామ్ చరణ్ తో నటించడం ఆనందంగా ఉంది. తమిళంలో హీరోగా చాలా చిత్రాల్లో నటించాను. గౌతం మీనన్ గారు ఎన్నై అరిందాల్ చిత్రంలో నన్ను విలన్ గా చూపించారు. అదే చిత్రం తెలుగులో ఎంతవాడుగానీ పేరుతో రిలీజ్ అయింది. రామ్ చరణ్ ఆ సినిమాలో నన్ను చూసి శ్రీనువైట్ల గారికి నా పేరు సజెస్ట్ చేసారు. రామ్ చరణ్ వండర్ ఫుల్ యాక్టర్. ఈ సినిమాతో మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది. తమన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు కూడా మంచి ఆడియో ఇచ్చారు. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
నిర్మాత తిరుపతి ప్రసాద్ మాట్లాడుతూ.. బ్రూస్ లీ అనే ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న పేరుతో ఈ సినిమా వస్తుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రికార్డ్స్ బ్రేక్ చేయాలి. దానయ్య గారికి మంచి లాభాలు రావాలి. ఆడియో, సినిమా పెద్ద సక్సెస్ కావాలి.. అని చెప్పారు.
జెమినీ కిరణ్ మాట్లాడుతూ.. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
బి.వి. ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. హిట్స్ లో ఉన్న చరణ్ ఈ సినిమాతో మరో హిట్ రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తమన్, రకుల్ ప్రీత్ సింగ్, జానీ మాస్టర్, రామజోగయ్యశాస్త్రి, వెంకటేశ్వరావు, నదియ, కృతి ఖర్బందా తదితరులు పాల్గొన్నారు.