అమ్మ అనే పదం వినగానే.. ఎవరికైనా కన్నతల్లి గుర్తుకువస్తుంది. అయితే తమిళనాడు ప్రజలందరికీ జయలలిత అమ్మ గానే ఎక్కువగా పరిచయం. పేద ప్రజల కోసం ఆమె ప్రవేశపెడుతున్న పథకాలు కూడా ఆమెకున్న అమ్మ బిరుదును సార్థకం చేస్తున్నాయి. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు పేదల కడుపులు నింపుతుండగా.. అమ్మ మెడికల్ దుకాణాలు అతి తక్కువ ఖర్చుకు ఔషధాలను అందిస్తూ పేదల అనారోగ్య సమస్యలను తీరుస్తున్నాయి. తాజాగా అమ్మ లిస్టులో మొబైల్ ఫోన్స్ కూడా చేరనున్నాయి.
తమిళనాడులోని మహిళా(సెల్ఫ్‌హెల్ప్) గ్రూపులకు ఉచితంగా మొబైల్ ఫోన్స్ అందించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 20 వేల సెల్‌ఫోన్లను రెడీ చేసి పెట్టుకుంది. వీటికి అమ్మ సెల్‌ఫోన్లంటూ నామకరణం చేసింది. అంతేకాకుండా మహిళా సంఘాల్లో అత్యధికులు తక్కువ చదువుకున్న వారు కావడంతో వారి సౌలభ్యం కోసం ఈ ఫోన్లను తమిళంలోనే ఆపరేట్ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా తయారుచేయించింది జయలలిత ప్రభుత్వం. మరికొన్ని నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరిన్ని పథకాలను ప్రకటించాలని జయ ప్రభుత్వం ప్రకటిస్తోంది.
ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా సరికొత్త ఆలోచనలతో పేదల సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న ఏడీఎంకేకు ప్రజల్లో కూడా ఆదరణ పెరుగుతోంది. ఇదే విషయంలో ఇటు డీఎంకేతోపాటు మిగిలిన ప్రతిపక్షాల్లో ఆందోళనకు కారణమవుతోంది. దీంతో రాష్ట్రంలోని సమస్యలపై ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని డీఎంకే ప్రయత్నిస్తోంది. మరి అటు అమ్మ.. ఇటు డీఎంకేల్లో ప్రజల మద్దతు ఎవరికుండనుందో వచ్చే ఎన్నికల్లోనే తేలనుంది.