పెద్ద చిన్న అందరూ హీరోలు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉంటే విక్టరీ వెంకటేష్ మాత్రం దృశ్యం, గోపాల గోపాల తర్వాత ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకున్నాడు. సోలోహీరోగా చేస్తాడా? లేక మల్టీస్టారర్ చేస్తాడా? అనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. అయితే ఆయన నటించబోయే చిత్రాలపై మాత్రం రోజుకో వార్త వస్తున్నప్పటికీ వాటిని కనీసం ఖండించడం కూడా లేదు. ఆకుల శివతో ఓ సినిమా అన్నారు. భాస్కర్ ది రాస్కెల్ రీమేక్, ఇక పలు తమిళ, మలయాళ, కన్నడ, బాలీవుడ్ చిత్రాల రీమేక్‌లలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. మధ్యలో చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇక ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు చిత్రాల డైరెక్టర్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయనున్నాడని, ఈ చిత్రం టైటిల్ సంతోషం సగం బలం అని కూడా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అయినా రోజులు గడుస్తున్నప్పటికీ వెంకీ నటించే తదుపరి చిత్రం ఇప్పటికీ ఫైనల్ కాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. తన తండ్రి రామానాయుడు మృతితో ఆయన బాగా అప్‌సెట్ అయ్యాడని, అదే సమయంలో ఆస్తుల పంపకాల్లో ఆయనకు సోదరుడు సురేష్‌బాబు వైఖరి నచ్చడం లేదని, అందుకే ఆయన కొంతకాలం గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆయన అభిమానులు మాత్రం తమ హీరో నటించే తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయంలో ఎంతో ఆసక్తి చూపుతున్నారు.