రవిబాబు తెరకెక్కించిన నువ్విలా చిత్రంలో గే క్యారెక్టర్ లో కామెడీని పండించిన హలీమ్ ఖాన్ గుర్తున్నాడు కదా. హవీష్ వెంట పడుతూ హలీమ్ చేసిన కామెడీకి థియేటర్ లో జనాలు కడుపు చక్కలయ్యేలా నవ్వారు. స్వతహా నృత్యకారుడైన హలీమ్ ఖాన్ కు అది పరిచయ చిత్రం. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ప్రాముఖ్యత లభించలేదు. నటన కంటే నాట్యానికే తన తొలి ప్రాధాన్యత ఇచ్చిన హలీమ్ ఖాన్.. దేశవిదేశాల్లో లెక్కకు మిక్కిలి నాట్య ప్రదర్శనలిచ్చాడు. అయితే.. నువ్విలా చిత్రంలో హలీమ్ హావభావాలను గమనించిన కొందరు దర్శకనిర్మాతలు హలీమ్ చేత తమ చిత్రంలో నటింపజేయాలని చూసినప్పటికీ.. హలీమ్ ఖాన్ నాట్య ప్రదర్శనల కారణంగా తీరిక లేకపోవడంతో.. సదరు ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. కొంత విరామానంతరం మళ్లీ సినిమాలపై దృష్టిని సారించాడు హలీమ్ ఖాన్. తాజాగా శ్రీ నిలయం అనే చిత్రంలో అభినయానికి ఆస్కారమున్న పాత్ర పోషించాడు. థ్రిల్లర్ ఫార్మాట్ లో తెరకెక్కిన శ్రీ నిలయం చిత్రంలో హలీమ్ ఖాన్ ఓ సైకో క్యారెక్టర్ లో నటించాడు. లేడీ గెటప్ లో హలీమ్ ప్రదర్శించే విలనిజం శ్రీ నిలయం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం కూడా భావించింది. అందుకే సినిమా పోస్టర్లపై హలీమ్ ఖాన్ లేడీ గెటప్ లో ఉన్న స్టిల్స్ నే ఎక్కువగా వినియోగించారు.
శ్రీ నిలయం తనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతోపాటు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుందని నాట్యకారుడు కమ్ నటుడు హలీమ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు!