టాలీవుడ్‌లో రీమిక్స్ పాటల పరంపర కొనసాగుతోంది. హిట్టయిన ఓ పాటని కొత్త హంగులతో మళ్లీ రిక్రియేట్ చేసి వినిపిస్తున్నారు. దీంతో సినిమాలకి ఆ పాటలు ఓ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఇటీవలే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన మామ చిరంజీవి పాట గువ్వా గోరింకతో... అనే పాటని రీమిక్స్ చేసి పాడుకొన్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంకోసం. ట్రైలర్లతోపాటు ఆ పాటని వినిపిస్తూ హల్ చల్ చేస్తోంది చిత్రబృందం. ఇదివరకు కూడా అలా బోలెడన్ని రీమిక్స్ పాటలొచ్చాయి.
తాజాగా అనుష్క సైజ్ జీరో చిత్రంలోనూ ఓ పాటని రీమిక్స్ చేస్తున్నారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన క్షత్రియ పుత్రుడు చిత్రంలోని సన్నజాజి పడక... అనే పాట ఎంతో పాపులర్ అయింది. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన ఆ పాటని ఇప్పటికీ శ్రోతలు గుర్తుకు చేసుకొంటుంటారు. సన్నివేశాలకి తగ్గట్టుగా ఉందని సైజ్ జీరో కోసం ఆ పాటని రీమిక్స్ చేశారట. ఆర్య,అనుష్క పై ఆ పాటను చిత్రీకరించారని తెలుస్తోంది. అందులోనే అనుష్క యమా స్పైసీగా కనిపించనుందని సమాచారం. ముద్దు సన్నివేశాలు కూడా ఆ పాటలోనే ఉంటాయంటున్నారు. మరి అది నిజమో కాదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రం ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కి చక్కటి స్పందన లభించింది. అనుష్క బొద్దుగుమ్మగా పడే పాట్లు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రాఘవేంద్రరావు తనయుడు దర్శకుడిగా ఈసారి విజయం అందుకోవడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఇదివరకు ఆయన అనగనగా ఓ ధీరుడు అనే చిత్రం చేశారు. ఆ చిత్రం అనుకొన్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో ప్రకాష్‌కి బాగా విరామం వచ్చింది. ఈసారి మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ని బేస్ చేసుకొని సినిమా తీశాడు. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.