వి.బాలు, ప్రియ, శ్రీతేజ్, అనన్యశెట్టి ప్రధాన పాత్రల్లో శ్రీమతి మేరుగు బతుకమ్మ సమర్పణలో తరుణిక ఆర్ట్స్ బ్యానర్‌పై శశిధర్ బోయపల్లి దర్శకత్వంలో అజయ్ మేరుగు నిర్మిస్తున్న చిత్రం కదిలే బొమ్మల కథ. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీలను నాజర్, ప్రసాద్‌లు ఆవిష్కరించి తొలి సీడీలను జీవా, దేవీప్రసాద్‌లకు అందించారు. ఈ సందర్భంగా..
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. పాటలు, ట్రైలర్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. అలాగే సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.. అని అన్నారు.
నాజర్ మాట్లాడుతూ.. సినిమాల్లో పెద్ద, చిన్న సినిమాలని తేడాలుండవు. అన్నింటిలో రిస్క్ ఒకటే. దర్శకుడు శశిధర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఇది నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. ఎంటర్‌టైనింగ్ మర్డర్ థ్రిల్లర్. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
జీవా మాట్లాడుతూ.. ట్రైలర్, పాటలు బావున్నాయి. సినిమా ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు మంచి బ్రేక్ తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
సంగీత దర్శకుడు నరేష్ రావుల మాట్లాడుతూ.. దర్శకుడు శశిధర్‌తో నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఇది మా కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా. మగాళ్ళ కంటే మృగాలు మిన్న అనే పాట నుండే సినిమా కథ పుట్టింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్.. అని అన్నారు.
నిర్మాత అజయ్ మేరుగు మాట్లాడుతూ.. నేను దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. అయితే దర్శకుడు శశిధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనడంతో కథ విన్నాను. కథ బాగా నచ్చడంతో మా టీం అంతా ఈ సినిమాని రూపొందించాం.. అని అన్నారు.
దర్శకుడు శశిధర్ బోయపల్లి మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళవుతుంది. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గా, రచయితగా ఇలా అనేక డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేశాను. ఆ అనుభవంతో ఈ సినిమాని రూపొందించాను. ఈ సినిమాని కన్నడ, తమిళంలో కూడా విడుదల చేస్తున్నాం.. అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: తిరుమల రావు, సంగీతం: నరేష్ రావుల, పాటలు: సోపేటి, చింతా శ్రీనివాస్, ఎడిటర్: కె.శ్రీనివాస్, కొరియోగ్రఫీ: తాజ్ ఖాన్, కోడి నాగేంద్రప్రసాద్, ఆర్ట్: రాజేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్.ఎ, నిర్మాత: అజయ్ మేరుగు, కథ, మాటలు, దర్శకత్వం: శశిధర్ బోయపల్లి.