రాజ్ కందుకూరి, హైమ రెడ్డి ప్రధాన పాత్రల్లో తెలంగాణా జాగృతి సమర్పణలో హైమ రెడ్డి దర్శకత్వంలో ఎస్.కె.ఆర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న లఘుచిత్రం 'లైఫ్ ఎగైన్'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా..
నటి గౌతమి మాట్లాడుతూ "వ్యక్తిగత బాధ్యతగా భావించి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. హైమ రెడ్డి కాన్సర్ ను ఎదిరించి పోరాడింది. ఒక కాన్సర్ ను ఎదిరించడమే చాలా కష్టం అలాంటిది రెండు క్యాన్సర్స్ ను ఎదిరించి జీవితాన్ని గడుపుతుంది. ఇలాంటి వాళ్ళే నిజమైన హీరోలు. కష్టాలు ఉన్నప్పుడు తలెత్తుకొని నిలబడాలి. కాన్సర్ ఎవరికైనా రావొచ్చు. ఈ లఘుచిత్రం చూడడం ద్వారా కాన్సర్ పై అవగాహన పెరుగుతుంది. ఈ చిత్రాన్ని అందరూ స్పూర్తిగా తీసుకోవాలి. దీనికి మద్దతుగా నిలిచిన కవిత గారికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ "కాన్సర్ రోగుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ షార్ట్ ఫిలిం ద్వారా చిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే కాన్సర్ మహమ్మారిని సులభంగా జయించవచ్చు. ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు చిన్న సమస్యలకే అమ్మాయిలు భయపడిపోతున్నారు. అలాంటిది హైమ రెండు కాన్సర్స్ పై పోరాడి గెలిచింది. ఇలాంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించేవారికి ప్రభుత్వం తరపున రాయితీ వచ్చేలా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుపుతాం" అని చెప్పారు.
హైమరెడ్డి మాట్లాడుతూ "కాన్సర్ వలన నేను ఎదుర్కొన్న సమస్యలను దానిని జయించిన విధానాన్ని లఘుచిత్రం ద్వారా ప్రజలకు తెలియబరచాలనుకుంటున్నాను. నేను కాన్సర్ తో బాధపడుతున్న రోజుల్లో గౌతమి గారు నాలో ఎంతో స్పూర్తిని నింపారు. కవిత గారు ఎన్.జి.వో ద్వారా ఎంతో సహకారాన్ని అందించారు" అని చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: కార్తిక్ కొడకండ్ల, లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ప్రవీణ్ కందెరేగుల, దర్శకత్వం: హైమరెడ్డి.