కమెడియన్ బ్రహ్మానందం గురించి ఇటీవల టాలీవుడ్లో పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలోనూ, ఆయన టైమింగ్స్ విషయంలోనూ దర్శకనిర్మాతలు గుర్రుగా ఉన్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న బాలకృష్ణ సినిమా 'డిక్టేటర్' నుంచి బ్రహ్మానందంని తొలగించారని వార్తలొస్తున్నాయి. అదొక్కటే కాదు... ఇంకా స్టార్ హీరోలకి సంబంధించి చాలా సినిమాల్ని బ్రహ్మీ లేకుండానే తీసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'శ్రీమంతుడు' లోనూ బ్రహ్మానందం లేడు. ఇలా చాలా సినిమాల్నే ఉదాహరణగా చూపిస్తున్నారు.
శ్రీనువైట్ల సినిమా అంటే బ్రహ్మానందం తప్పనిసరి. ఆయనకోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు రాస్తుంటాడు శ్రీనువైట్ల. కానీ ఈసారి మాత్రం బ్రహ్మీ లేకుండానే చరణ్‌తో సినిమా తీశాడని, బ్రహ్మీ సినిమాలో ఉండకూడదని స్వయంగా చిరంజీవే చెప్పారని టాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అది నిజమా కాదా అన్నది స్పష్టం కావాలి. అయితే ఇటీవల దిల్‌రాజు కూడా ఓ సినిమాలో బ్రహ్మీ చేసిన సన్నివేశాలన్నింటినీ కట్ చేయించారని మరో ప్రచారం మొదలైంది. బ్రహ్మీపై ఉన్న కోపంతోనే దిల్‌రాజు ఆ పని చేశాడని అంటున్నారు.
దిల్‌రాజు 'సినిమా చూపిస్త మావ' అనే సినిమాని ఇటీవల కొనుగోలు చేశాడు. ఆ సినిమాలో బ్రహ్మానందం కూడా నటించాడు. నా పేరు దయ... నాకు లేనిదే అది అంటూ ట్రైలర్‌లోనూ ఆయన సన్నివేశాల్ని చూపించారు. కానీ సినిమా తెరపైకొచ్చేసరికి బ్రహ్మీ ఎపిసోడ్ కనిపించలేదట. సినిమాని కొన్న దిల్‌రాజే ఆ సన్నివేశాల్ని కట్ చేయించాడని చెబుతున్నారు. లాగ్ ఎక్కువవుతుందని చెప్పి దిల్‌రాజు ఆ సన్నివేశాల్ని కట్ చేయించినట్టు సమాచారం. కొద్దిమంది బ్రహ్మీపై కోపంతోనే ఆయన తీయించారని చెబుతున్నారు. మరి కొద్దిమంది మాత్రం దిల్‌రాజు ఏ సినిమా చేసినా అది ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ట్రిమ్ చేయిస్తుంటారని అందులో భాగంగానే బ్రహ్మీ ఎపిసోడ్‌ని తీసేసుండొచ్చు కానీ... పనిగట్టుకొని మాత్రం కాకపోయుండొచ్చని చెబుతున్నారు.