మాస్ మహారాజా రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’ కు సీక్వెల్ గా మళ్ళీ కిక్ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘కిక్ 2’. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం హైదరాబాద్ లోని ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. రవితేజ, నందమూరి రామకృష్ణ, కళ్యాన్ రామ్, వినాయక్ చేతుల మీదుగా చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్ లను అందించారు. ఈ సందర్భంగా..
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ "మా తాత గారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పేరు మీద ఈ బ్యానర్ ను స్థాపించాం. మొదటిసారి సురేందర్ రెడ్డి తో కలిసి 'అతనొక్కడే' చిత్రాన్ని నిర్మించినప్పుడు కళ్యాణ్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాడని అందరూ అన్నారు. ఈ బ్యానర్ లో క్వాలిటీ సినిమాలే తీస్తాను. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. 2007 లో మళ్ళి నేను సూరి కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. అయితే మా బ్యానర్ లో ఎప్పుడు హీరోగా నేనే నటిస్తాను. మొదటిసారి మరో హీరోతో కలిసి నేను నిర్మాతగా ఈ చిత్రాన్ని చేసాను. నాకు చాలా ఇష్టమైన హీరో రవితేజ గారు. సీతారామరాజు సినిమా నుండి ఆయన నాకు తెలుసు. మా ఫ్యామిలీ హీరో తను. ఈ సినిమా షూటింగ్ మొదలయిన తరువాత నేను రెండు రోజులు మాత్రమే లొకేషన్ కు వెళ్లాను. సురేందర్ రెడ్డి, రవితేజ గారిపై నాకు అంత నమ్మకం ఉంది. సూరి జర్నీ మా బ్యానర్ ద్వారానే మొదలయ్యింది. అందుకే ఈ చిత్రాన్ని చాలా బాధ్యతతో తీసాడు. సినిమా క్వాలిటీగా రావడం కోసం రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుంది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి థాంక్స్. ఆగస్ట్ 21 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం" అని చెప్పారు.
రవితేజ మాట్లాడుతూ "ఆగస్ట్ 21 న విడుదలవుతున్న ఈ చిత్రం అందరికి మంచి కిక్ ను ఇస్తుంది" అని చెప్పారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్ కు, మంచి సాహిత్యాన్ని ఇచ్చిన లిరిక్ రైటర్స్ కు థాంక్స్. రవి తేజతో పాటు ఈ సినిమాకి మనోజ్ పరమహంస, వక్కంతం వంశి ఇలా చాలా మంది హీరోలు ఉన్నారు. 'కిక్ 2' నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది. కళ్యాన్ రామ్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. రవితేజ ఈ సినిమాలో తన బెస్ట్ ఎనర్జీ ఇచ్చాడు. కిక్2 రవితేజ లేకుండా ఊహించలేం. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ "ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో చేసిన 'అతనొక్కడే' చిత్రంతో సురేందర్ పరిచయమయ్యాడు. ఆ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో 'కిక్2' అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ట్రైలర్ చాలా క్వాలిటీ గా ఉంది. కళ్యాన్ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాడు. రవితేజ మంచి ఎనర్జీ తో నటించాడు. వక్కంతం వంశీ, సురేందర్ ఫెయిల్యూర్ తెలియని కాంబినేషన్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ "కిక్ సినిమా చూసి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ తో కిక్ 2 కు వస్తారో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కిక్2 ఉంటుంది. రవితేజ, సురేందర్ రెడ్డి లతో మరలా వర్క్ చేసే అవకాసం రావడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, రామ్ లక్ష్మణ్, జానీ మాస్టర్, పృధ్వీ, రాఘవ, బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.
మాస్ మహారాజా రవితేజ సరసన రకుల్‌ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.