మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు వున్నా, మరెన్ని బ్లాక్‌బస్టర్స్ వున్నా 'ఘరానా మొగుడు' చిత్రానికి వున్న ప్రత్యేకత వేరు. మాస్ మసాలా మూవీగా, మ్యూజికల్ హిట్‌గా, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన సినిమాగా 'ఘరానా మొగుడు' ఓ సంచలనం. 1992లో విడుదలై మెగాస్టార్‌కి ఓ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా మరోసారి మన ముందుకు రాబోతోంది. టెక్నాలజీ పరంగా రోజురోజుకీ డెవలప్ అవుతున్న సినిమాల వరసలో ఇప్పుడు 'ఘరానా మొగుడు' చిత్రం కూడా నిలవబోతోంది. ఈ చిత్రాన్ని 4కె, 2కె ఫార్మాట్‌లో 5.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్‌లోకి మార్చి ఫస్ట్ కాపీని సిద్ధం చేశారు. శివప్రియ మూవీస్, కర్ణాటక మెగాస్టార్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం శ్రీరామ్ వై. సారధ్యంలో రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని మొదట కర్ణాటకలో విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదలవుతుంది. 1992లో సంచలనం సృష్టించిన 'ఘరానా మొగుడు' ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మరి.!