తెలుగు సినిమా వాణిజ్య స్థాయిని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇంతటితో ఆగేలా లేడు. బాహుబలి దెబ్బకు బాలివుడ్ సైతం అబ్బా అంటుంటే, జక్కన్న తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ మాత్రం మీరు చూసింది టీజర్ మాత్రమే, మిగిలిన పెద్ద సినిమా ముందుంది అంటూ మోచేతికి బెల్లం పెట్టి రుచి చూసుకోండి అని సెలవిస్తున్నాడు. విషయం ఏమిటంటే రాజమౌళికి ఉన్న డ్రీం ప్రాజెక్టుల్లో బాహుబలి అనేది ఓ శాంపుల్ మాత్రమే. గతంలో ఎన్నోసార్లు తనకు ఉన్న అతి పెద్ద కోరిక మహాభారతాన్ని తెర మీద ఆవిష్కరించడమేనని జక్కన్న చెప్పుకున్నాడు. బాహుబలి కథకి మహాభారతంతో సారూప్యం ఉన్నా ఇది పక్కాగా ఓ ఫ్యాంటసీ.
'నాన్న, నేను బాహుబలి ఎందుకు తీస్తున్నానో తెలుసా. నాకు ఈ కథ ఎంతో నచ్చి కాదు. నా ఆశయమెల్లా మహాభారతాన్ని అందరు గర్వించేలా తెర మీదకు ఎక్కించాలని. అందుకు బాహుబలి ట్రయల్ మాత్రమే. ఇది సక్సెస్ అయితే అది కూడా సక్సెస్ అవుతుంది,' అని అక్షరాలా రాజమౌళి తన తండ్రి గారితో విన్నవించుకున్నాడు.
మరి బాహుబలిలో విజయెంద్రుడు, రాజమౌళి చూపిన సృజనాత్మకతకు, కళానైపుణ్యానికి యావత్ భారతదేశం దాసోహం అంటుంటే ఇక భారతాన్ని తెలుగు, తమిళంలో (హిందీలో కూడా) మన తెలుగు స్టార్ హీరోలతో, తెలుగు నిర్మాతలతో గనక చెక్కడం మొదలు పెడితే ముంబై సినిమాని ఏలుతున్న బాలివుడు బడాబాబులందరికీ చెమటలు పోయించకుండా ఉంటారా ఈ తండ్రి కొడుకులు. అదీ తెలుగోడి దెబ్బంటే.