లయన్ సాయివెంకట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. అటు రియాల్టీ రంగంలోనూ ఇటు సినీ ప్రపంచంలో తనదైన ముద్రవేసారు. కొన్ని చిత్రాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించి దర్శకనిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న సాయి వెంకట్ ఒకేసారి పదిసినిమాలను ప్రారంభించి సరికొత్త చరిత్రను తెలుగు సినిమా పరిశ్రమలో సృష్టించబోతున్నారు. ఆయన నిర్మించబోతున్న చిత్ర విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా..
సాయి వెంకట్ మాట్లాడుతూ "ఒకప్పుడు ఏపి ఫిలిం ఛాంబర్ ఉండేది. అది కాస్త తెలుగు ఫిలిం ఛాంబర్ గా ఏర్పడిన తరువాత వచ్చిన మొదటి ఎన్నికల్లో సెక్రటరీ గా ఎంపికయ్యాను. చిన్న నిర్మాతలకు నా వంతు సహాయసహకారాలు అందిస్తాననే నమ్మకంతో నన్ను గెలిపించారు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఓ బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. ఈ బ్యానర్ పై ఒకే సారి పది సినిమాలను ప్రారంభించి సరి కొత్త రికార్డును సృష్టించాలనుకుంటున్నాను. ప్రతిభావంతులైన కొత్త తరాన్ని ప్రోత్సహిస్తే.. శంకరాభరణం.. స్వాతిముత్యం లాంటి కళాత్మక చిత్రాలు మరిన్ని వచ్చి సినీవినీలాకాశంలో తెలుగువారికి మరింత ప్రత్యేక స్థానం ఉంటుంది. కొత్త దర్శకులు, రచయితలు, టెక్నీషియన్స్ వస్తే తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. ఇప్పటికి 200 వందల మంది దర్శకులు కథలతో నన్ను సంప్రదించారు. అందులో 10 నుండి 20 మంది మాత్రమే డిఫరెంట్ కాన్సెప్ట్ లను చెప్పారు. 5కథలను ఫైనలైజ్ చేశాం. ఐదుగురు దర్శకులు కన్ఫర్మ్ అయ్యారు. మిగతా దర్శకులు ఫైనలైజ్ అయిన తర్వాత ఒకేరోజు ఓపెనింగ్ జరుపుతాం. వాటి చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఒకేరోజు ఆడియో విడుదల చేసి, ఒకేరోజు చిత్రాలను విడుదల చేస్తాం. తద్వారా నిర్మాతకు ఎంతో ఖర్చు తగ్గుతుంది" అని చెప్పారు.