`శ్రీమంతుడు`లోని జతకలిసే సాంగ్ ట్రైలర్‌ని చూసినవాళ్లని ఓ విషయం ఆసక్తి రేపింది. అదేమిటంటే... శ్రుతిహాసన్ కాలుని మహేష్ చేత్తో పట్టుకోవడం. హవ్వ...మహేషేంటి హీరోయిన్ కాలు పట్టుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. మరికొద్దిమంది మాత్రం సమంతకి రిటార్డ్ ఇవ్వడానికే ఆ పనిచేశాడని చెప్పుకొంటున్నారు. ఇంతకీ సమంతకీ, శ్రుతిహాసన్ కాలుని మహేష్ పట్టుకోవడానికి మధ్య సంబంధమేమిటంటారా? `1` పోస్టర్ అమ్మాయిల్ని కించపరిచేలా ఉందని సమంత కామెంట్ చేసిన విషయానికి ఇక్కడ లింకు పెట్టి మాట్లాడుకొంటున్నారు. `1` పోస్టర్‌లో కృతిసనన్ హచ్‌కుక్కపిల్లలా మహేష్‌ని అనుసరిస్తున్నట్టు ఉంది. అది చూసిన సమంత `అమ్మాయిల్ని కించపరిచేలా ఉంద`ని అప్పట్లో కామెంట్ చేసింది. ఆ తర్వాత మహేష్ దానికి సమాధానం కూడా చెప్పాడు. అయితే సన్నివేశం డిమాండ్ చేస్తే హీరోయిన్నే కాదు, హీరోలు కూడా హీరోయిన్ల కాలు పట్టుకొంటారని మహేష్ చాటి చెప్పేందుకే `శ్రీమంతుడు`లో ఆ సన్నివేశం చేశారని అభిమానులు చెబుతున్నారు.
మహేష్ ఓ సూపర్‌స్టార్. సక్సెస్‌లూ, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ఆయన తన కెరీర్‌ని నిర్మించుకొన్నాడు. పరిశ్రమ స్థాయిని పెంచిన ఘనత ఆయనది. ఇమేజ్, హీరోయిజం లాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోడు. అలా పట్టించుకొనేవాడే అయితే `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లాంటి సినిమాల్ని చేయడు. అందుకే రొమాంటిక్ సన్నివేశాల్లో భాగంగా `శ్రీమంతుడు`లో శ్రుతిహాసన్ కాలుని లాగి తన కాలుపై వేసుకొన్నట్టుండే సన్నివేశాలు చేశాడు. ఆ సన్నివేశం ఒక్కటే కాదు... జతకలిసే పాట మొత్తం చాలా రొమాంటిక్‌గా సాగుతున్నట్టు అనిపిస్తోంది. `శ్రీమంతుడు` ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది.