‘బాహుబలి’ చిత్రాన్ని జూలై 10న రిలీజ్ చేస్తామని రాజమౌళి, ప్రభాస్ ప్రకటించగానే అందరూ అనుకున్నది ఒకే ఒక మాట రాజమౌళి అలా అంటాడు గానీ ఆ డేట్‌కి రిలీజ్ చెయ్యడం కష్టం అని. టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఇదే మాట మీద ఫిక్స్ అయింది. అందుకే జూలై 10ని పట్టించుకోకుండా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఎనౌన్స్ చేసేశారు. ఎప్పుడైతే ‘బాహుబలి’ పక్కాగా రిలీజ్ అవుతుందని తెలిసిందో ఎక్కడివారు అక్కడ సర్దుకున్నారు. ‘బాహుబలి’ స్పీడ్‌ని తట్టుకోవాలంటే రెండు, మూడు వారాలు ఆగాల్సిందే అని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఆఖరికి గుణశేఖర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘రుద్రమదేవి’ చిత్రం రిలీజ్‌ని కూడా వాయిదా వేసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వని కారణంగా జూన్ 26న రిలీజ్ చెయ్యాలనుకున్న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యలేకపోతున్నానని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తానని చెప్పాడు. అది నిజమో కాదో పక్కన పెడితే ‘రుద్రమదేవి’ రిలీజ్ పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల గుణశేఖర్‌కి మంచే జరగబోతోందని ‘బాహుబలి’ రిజల్ట్ చూస్తే తెలుస్తోంది. ఎందుకంటే ఆ చిత్రంలో దేవసేనగా నటించిన అనుష్కకి మొదటి భాగంలో ఎక్కువ ప్రాధాన్యం లేకపోవడం, గ్లామర్ ఎపిసోడ్స్ అన్నీ రెండో భాగంలోనే వుండడం వల్ల అది ‘రుద్రమదేవి’కి బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ‘బాహుబలి’లో నటించిన అనుష్క, రానా ‘రుద్రమదేవి’లో కూడా నటించడం వల్ల ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయింది.
‘బాహుబలి’ మొదటి భాగంతో సంతృప్తి చెందని ఆడియన్స్‌కి రెండో భాగం చూడాలంటే సంవత్సరం ఆగాల్సిందే. ఈ తరుణంలో ‘రుద్రమదేవి’ ఆడియన్స్‌కి కాస్త ఊరట కలిగించే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీగా గుణశేఖర్ రూపొందించిన ‘రుద్రమదేవి’ విజువల్‌గా ఆడియన్స్‌ని థ్రిల్ చేసే అవకాశాలు ఎక్కువ. ‘బాహుబలి’ చిత్రం వల్ల కాస్త మరుగున పడ్డ ‘రుద్రమదేవి’ చిత్రానికి ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. ‘బాహుబలి’ తర్వాత ఈ సంవత్సరాంతం వరకు ‘రుద్రమదేవి’ సందడి చేస్తుంది. ‘రుద్రమదేవి’ చిత్రం వల్ల రాజమౌళికి కూడా అడ్వాంటేజ్ వుంది. అదేమిటంటే మొదటి భాగం చూసి పూర్తిగా సంతృప్తి చెందని ఆడియన్స్‌కి ‘రుద్రమదేవి’ కొన్నాళ్ళు చేసే సందడి వల్ల ‘బాహుబలి2’ చిత్రం సంవత్సరం టైమ్ తీసుకున్నా ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఫీలింగ్ కలగదు. కాబట్టి ‘బాహుబలి2’ గురించి కొన్నాళ్ళు మర్చిపోయేలా చేస్తుంది ‘రుద్రమదేవి’.