పవన్ అగర్వాల్, బిందు బార్బీ జంటగా కన్నాంబ పసుపులేటి మూవీస్ పతాకంపై శివనాగేశ్వర్‌రావు దర్శకత్వంలో పసుపులేటి నిర్మిస్తున్న చిత్రం ‘మనసంతా నువ్వే’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణా హొమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేశారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా..
నాయిని నరసింహరెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రస్తుత సమాజంపై సినిమాలు చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి సినిమాల్లో మంచిని చూపించడానికే ప్రయత్నం చేయాలి. గతంలో ఎన్టీఆర్‌గారు, ఎ.ఎన్.ఆర్‌గారు సమాజానికి మంచి సందేశాలను ఇచ్చే చిత్రాల్లోనే నటించారు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నాను. ఈ ఆడియో, సినిమా మంచి విజయాన్ని సాధించాలి. దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలి’’ అని అన్నారు.
నిర్మాత పసుపులేటి మాట్లాడుతూ ‘‘ఇదొక లవ్‌స్టోరీ. దర్శకుడు శివనాగేశ్వరరావు మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ర్యాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
దర్శకుడు శివనాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ‘‘నిజమైన ప్రేమకథకు అర్ధం చెప్పే సినిమా ఇది. పవన్, బిందు చక్కగా నటించారు. షకీల్ మ్యూజిక్ చాలా బావుంటుంది. సినిమా తప్పకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ ‘‘హీరో పవన్ నాకు మంచి ఫ్రెండ్. దర్శకుడు నిజమైన ప్రేమకు అర్థం చెప్పే చిత్రాన్ని రూపొందించారు. ఆడియో, సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో పవన్, హీరోయిన్ బిందు బార్బీ, సంతోష్‌కుమార్, అలీఖాన్, మోహన్‌గౌడ్, పిడమర్తి రవి, పసుపులేటి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
చంద్రమోహన్, అమ్మ రాజశేఖర్, గీతాసింగ్, జెన్ని, సుమన్ శెట్టి, బండ భాషా, ఆంజనేయు, స్విర్ సురేష్, శ్రీజ, వైష్ణవి, ఆదిత్య, ధను తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నందగోపాల్, సాహిత్యం: భాషా శ్రీ, నందు గ్లాటి, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, నిర్మాత: పసుపులేటి, దర్శకత్వం: శివ నాగేశ్వర్‌రావు.