మరో కొత్త కథానాయికతో కలిసి సందడి చేయబోతున్నాడు గోపీచంద్. వరుసగా రకుల్, రాశిఖన్నాలాంటి అందగత్తెలతో సినిమాలు చేసిన ఆయన త్వరలో రెజీనాతో జోడీ కట్టబోతున్నాడు. ఒకప్పుడు యాక్షన్ చిత్రాల కథానాయకుడిగా గుర్తింపు పొందిన గోపి ఇటీవల స్టైల్ మార్చాడు. వినోదానికి ప్రాధాన్యమున్న కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్నాడు. `యజ్ఞం` తరవాత గోపీచంద్ - ఏఎస్ రవికుమార్ చౌదరి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. `యజ్ఞం` యాక్షన్ చిత్రం కాగా ఈసారి వినోదం ప్లస్ యాక్షన్ కి ప్రాధాన్యమిస్తూ కథను రెడీ చేసుకున్నాడు చౌదరి. ఈ చిత్రంలో కథానాయికగా ఆయనే రెజీనాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రవికుమార్ చౌదరిని మళ్లీ హిట్ బాట పట్టించిన.. పిల్లా నువ్వు లేని జీవితంలో రెజీనా కథానాయికగా నటించింది. అందులో రెజీనా పాత్ర ఆమె నటన.. రవికుమార్ చౌదరిని బాగా ఆకర్షించాయట. అందుకే... మళ్లీ ఆమెకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ఈనెల 15 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంని సమాచారం.