తన 150వ సినిమాతో చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఆ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నారు. దానికి `ఆటోజానీ` అనే పేరు ప్రచారంలో ఉంది. అభిమానులు కూడా అదే పేరునే ఫిక్సయిపోయారు. కానీ చిరు 150వ సినిమా పేరు అది కాదట. ఆ విషయాన్ని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు స్వామినాయుడు స్వయంగా తెలిపాడు. అందరూ అనుకొన్నట్టుగా చిరు సినిమా పేరు ఆటోజానీ కాదని, మరో పేరుతో ఆ చిత్రం తెరకెక్కబోతోందని ఆయన నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపాడు. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ స్వయంగా `ఆటోజాని` అనే పేరును ప్రకటించాడు. ఇప్పుడు కానీ స్వామినాయుడేమో ఆ పేరును కాదంటున్నాడు. ఇంతకీ చిరు 150వ సినిమా విషయంలో ఏం జరుగుతోందో అభిమానులకు అర్థం కావడం లేదు. పూరి కథ చెప్పినప్పటికీ చిరు మాత్రం వినాయక్‌లాంటి అగ్ర దర్శకులతో రోజూ చర్చలు జరుపుతున్నారు. ఇంతకీ చిరు సినిమా పూరి దర్శకత్వంలో ఉంటుందా లేదా? లేకపోవడంతోనే ఆ పేరు కాదని స్వామినాయుడు ప్రకటించాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే చిరు బర్త్ డే లోపు ఆయన చేయబోయే సినిమా ఎవరితోననేది ఖరారయ్యే అవకాశాలున్నాయి. చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకకి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని స్వామి నాయుడు తెలిపారు.