సినిమా పరిశ్రమలో అందరి దృష్టీ దర్శకత్వంపైనే ఉంటుంది. ఎవరు ఏ విభాగంలో పనిచేస్తున్నప్పటికీ ఎప్పుడో ఒకసారి దర్శకుడు అనిపించుకోవాలనే కోరిక వారి మనసులో బలంగా ఉంటుంది. అందుకే కొరియోగ్రాఫర్‌లు, కెమెరామెన్‌లు, మ్యూజిక్ డైరెక్టర్లు, యాక్టర్లు, ప్రొడ్యూసర్లు.. ఇలా రకరకాల విభాగాలకు చెందినవాళ్లు సైతం దర్శకులయ్యారు. రాజమౌళి కెమెరామెన్ సెంథిల్ కూడా దర్శకుడు కావాలనుకొంటున్నాడట. బాహుబలి 2 పూర్తి కాగానే ఆ పనిమీదే ఉంటానంటున్నాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూల్లో సెంథిల్ మాట్లాడుతూ ``నేను దర్శకుడు కావాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నా. కానీ రాజమౌళిగారు ఎప్పటికప్పుడు కొత్త రకమైన కథలు చెబుతూ నన్ను ఆసక్తికి గురిచేస్తున్నారు. దీంతో ఈ సినిమా పూర్తయ్యాక దర్శకత్వం చేద్దాం అనుకొంటూ ప్రయాణం చేస్తున్నా. ఈసారి మాత్రం తప్పకుండా దర్శకత్వం చేస్తా`` అని చెప్పుకొచ్చాడాయన. బాహుబలి 2కి కూడా తానే ఛాయగ్రాహకుడిగా పనిచేస్తున్నట్టు తెలిపారు సెంథిల్.