మీ సినిమాను సెన్సార్ బోర్డ్‌కి తీసుకెళ్లాలా? అయితే జేబులో లక్ష రూపాయిల అదనంగా ఉండాల్సిందే. లేదంటే మీ సినిమాకు ఎక్కడెక్కడ ఏ కట్స్ పడతాయో, ఏ డైలాగ్ సినిమా నుంచి తొలగిస్తారో కూడా చెప్పలేం. లక్ష ఇస్తే మీరు కోరిన సెన్సార్ సర్టిఫికెట్ మడత కూడా పడకుండా మీ చేతుల్లో పడుతుంది. మీ సినిమా ఏ రేటెడ్ అయినా ఫర్వాలేదు. సెన్సార్ ఆఫీసర్ అడిగింది ముట్ట చెబితే ’ఎ’ కావాలంటే ఎ, యు/ఎ కావాలంటే యు/ఎ ఇచ్చేస్తారు. ఆ విధంగా మన సెన్సార్ బోర్డ్ పని చేస్తుంది.
ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? దీనికో చిన్న కథ ఉంది. ఓ కొత్త నిర్మాత చిన్న బడ్జెట్‌లో ఓ సినిమా తీశాడు. చిన్న నిర్మాతకు ఉండే కష్టాలు అందరికీ తెలిసినవే కదా. ఈ నిర్మాత కూడా ఏదోలా సినిమా పూర్తి చేసి సెన్సార్‌కి తీసుకెళ్లాడు. ఆఫీసర్ సినిమా చూసి మార్పులు, కత్తిరింపులు చెప్పాడు. సదరు నిర్మాత క్లీన్ ‘యు’ అడిగాడు. అందుకు ఆ అధికారి అక్షరాల లక్ష అడిగాడు. చిన్న నిర్మాత పని కావాలి కాబట్టి లొంగి అంత ఇచ్చుకోలేను గురుగారు అన్నాడు. ఆకలి మీదున్న అధికారి రూ.50 వేలు అడిగాడు. నిర్మాత ‘నేను తీసింది బాహుబలి కాదు’ ఓ చిన్న సినిమా పదివేలు ఇస్తాను అన్నాడు. అందుకు అధికారి అంగీకరించి క్లీన్ ‘యు’కి బదులు ‘యు/ఎ’ ఇచ్చాడు. ఈ శుక్రవారం(జూన్, 26) ప్రేక్షకుల ముందుకొచ్చిందా సినిమా.
కానీ నిర్మాత సెన్సార్ అధికారికి డబ్బు చెల్లించలేదు. ఇక ఫోన్‌లు మొదలయ్యాయి. ‘సినిమాకు లక్ష తీసుకుంటున్నాం. నువ్వు పదివేలు ఇవ్వడానికి కూడా ఏడుస్తున్నావ్ అంటూ సదరు అధికారి అనుచరుడు నుంచి నిర్మాతకు ఫోన్ వచ్చింది. నిర్మాత తెలివిగా పదివేలతో పాటు సీబీఐని కూడా గుట్టుచాటుగా తీసుకెళ్లాడు. ఆ పదివేలు సెన్సార్ అధికారికి ఇస్తుండగా సీబీఐ రంగంలోకి దిగింది. రెడ్‌హ్యాండెడ్‌గా అధికారిని పట్టుకొంది.
ఆ మహానీయుడు పేరు జి.శ్రీనివాసరావు. ఆ సినిమా పేరు ‘అందమైన చందమామ’. పి.డి.ఆర్.ప్రసాద్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. పక్కా ప్లాన్‌తో శ్రీనివాసరావుని పట్టించింది ఈ చిన్న నిర్మాతే. ఇదంతా చిన్న సినిమా నిర్మాతగా ఆయనకున్న కడుపుమంటే కారణం. అందుకే అక్కడ జరిగిన సంభాషణ నుండి అన్ని రికార్డర్‌లో భద్రపరిచాడు ఆ నిర్మాత. అయితే కేస్ నమోదు చేసుకున్న సీబీఐ సెన్సార్ కార్యాలయంలోనే నిందితుడిని, నిర్మాతను ఎంక్వైరీ చేశారు. సదరు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ధనలక్ష్మీ బదిలీ అయిన తర్వాత విజయ్‌కుమార్‌రెడ్డి సెన్సార్ అధికారిగా నియమితులయ్యారు. కొద్ది నెలలకే ఆయన కూడా బదిలీ అయ్యి ఆ ప్లేస్‌లోకి శ్రీనివాసరావు వచ్చి ఈ కేస్‌లో ఇరుక్కున్నారు. ఈయన రోజుకి మూడు లేదా నాలుగు సినిమాలు చూస్తాడు. అంటే రోజుకి ఈయనగారి ఆదాయం మూడు నుండి నాలుగు లక్షలు. ఇక ట్రైలర్స్‌కి సెన్సార్ అంటే అన్ లిమిటెడ్. అంటే నెలకి ఈయన ఆదాయం కోటి రూపాయిలు అనుకోవచ్చు.
అయితే ఇటీవల కాలంలో హీరోయిన్ ఎంతగా ఎక్స్‌పోజ్ చేసినా, బూతు డైలాగులు ఎన్ని ఉన్నా కొన్ని సినిమాలకు యు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇదే కారణం అనమాట.