సినిమా అంటే అందరికీ హీరోహీరోయిన్లే ప్రముఖంగా కనిపిస్తారు. అందరూ వాళ్ల గురించే మాట్లాడుకుంటుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని, ఆ పాత్రల్ని కరివేపాకు చందంగా చూస్తుంటారు. అయితే ఎప్పుడూ లేనివిధంగా ఇద్దరు నిన్నటితరం హీరోయిన్లు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకొనేలా చేశారు. దర్శకులు కానీ ఇతర నటీనటులు కానీ హీరో హీరోయిన్ల కంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించే ఎక్కువగా మాట్లాడుకొంటున్నారు. అందుకు కారణం శ్రీదేవి, రమ్యకృష్ణలే. ఒకప్పుడు వీళ్లిద్దరూ హీరోయిన్లుగా వెండితెను ఏలారు. వయసు మీద పడటంతో ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. రమ్యకృష్ణ ఎప్పట్నుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నా... శ్రీదేవి మాత్రం తమిళ చిత్రం ‘పులి’తోనే ఆ ప్రయత్నం చేస్తోంది. పులిలో ఓ కీలక పాత్ర కోసం శ్రీదేవిని ఎంపిక చేసుకొన్నారు. ఆమెకు ఆ పాత్రకోసం ఏకంగా 4 కోట్లు ఇస్తున్నారట. ఇటీవల విడుదలైన ‘పులి’ టీజర్‌ని చూశాక విజయ్‌కంటే శ్రీదేవి గురించే ఎక్కువగా మాట్లాడుకొన్నారు. ఆ టీజర్‌లో శ్రీదేవినే స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అలాగే ‘బాహుబలి’లో శివగామిగా నటించిన రమ్యకృష్ణ గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకొంటున్నారు. రాజమౌళి అయితే రమ్యకృష్ణ లేకపోతే ఈ సినిమానే లేదు అని చెబుతున్నాడు. మాకు ఎప్పుడైనా కాస్త నిరుత్సాహంగా అనిపిస్తే రమ్యకృష్ణ నటనని గుర్తుకు తెచ్చుకొనేవాళ్లం అని చెబుతున్నాడు. ఆ రకంగా రమ్యకృష్ణ , శ్రీదేవి సహాయ పాత్రలకు కొత్త వన్నె తీసుకొచ్చినవాళ్లయ్యారు. వీళ్లకు ఇలాంటి పాత్రలు వరసకట్టే అవకాశాలున్నాయని అర్థమవుతోంది.