తనిష్క మల్టీ విజన్ బ్యానర్ పై లక్ష్మణ్ మురారి దర్శకత్వంలో గుజ్జ యుగంధర్ రావు పూర్తి తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో నిర్మించిన సినిమా ‘బందూక్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 19 న విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తిక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రసమయి బాలకిషన్, విజేందర్ రెడ్డి షీల్డులను ప్రధానం చేసారు. ఈ సందర్భంగా నిర్మాత గుజ్జ యుగంధర్ రావు మాట్లాడుతూ "శాంతియుతంగా ఇంత పెద్ద తెలంగాణాను ఈరోజు ఎలా సాధించుకున్నాం అనే ముఖ్య ఉద్దేశ్యంతో చేసిన సినిమానే 'బందూక్'. తెలంగాణా సాధించే వరకు ఎలాంటి ఉద్యమాలు జరిగాయో వాటన్నింటినీ భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీసాం. మనిషి కన్నా అతనిలో చెడుతనాన్ని అంతమొందించడమే ముఖ్యమని ఈ సినిమా ద్వారా తెలుపుతున్నాం. గోరటి వెంకన్న గారు పది జిల్లాల ప్రాముఖ్యతను వర్ణిస్తూ రాసిన బ్రీత్ లెస్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. తెలంగాణాకు చెందిన కళాకారులతో, సాంకేతిక నిపుణులతో తెరకెక్కించిన చిత్రమిది" అని అన్నారు.
లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ "తెలంగాణా పోరాట సమయంలో వెలుగు చూడని కోణాలను ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ సినిమా ఇది. జూన్ 19న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని చెప్పారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ "తెలంగాణా అవతరించిన తరువాత తెలంగాణా మీద వచ్చిన మొదటి చిత్రమిది. బాహుబలి వంటి చిత్రాలను తీయడానికి ఎవరైనా వస్తారు. కాని 'బందూక్' లాంటి సినిమా కొందరే తీయగలరు. దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ చిత్రం ద్వారా చెప్పాడు. జూన్ 19న విడుదలవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్.శంకర్, నందిని సిద్దారెడ్డి, అమరేందర్, వైభవ్, శివకుమార్, చిత్ర నటీనటులు తదితరులు పాల్గొన్నారు.