ఎ.ఆర్.రెహమాన్.. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఏ భారతీయ సంగీత దర్శకుడికి దక్కని గౌరవం అతనికి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తోంది. సినిమా సంగీతంలో అతను చెయ్యని ప్రయోగం లేదు. అతని సంగీతం అంటే ఇష్టపడని సంగీత ప్రియుడు లేడు. తన సంగీతాన్ని ఆస్వాదించి తనని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారతదేశం కోసం అతను ఆస్కార్ తీసుకొచ్చాడు. 2009లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికి అతను అందించిన ఒరిజినల్ స్కోర్‌కి ఆస్కార్ అవార్డు అందుకున్న ఎ.ఆర్.రెహమాన్ ఇప్పుడు మరో ఆస్కార్ అందుకోదగిన మ్యూజిక్‌తో మన ముందుకు వస్తున్నాడు. అయితే అది ఇండియన్ సినిమా కాదు. ఇరాన్‌లో నిర్మించబడుతున్న ‘మహమ్మద్’ అనే చిత్రం. పెర్షియన్, అరబిక్‌లలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదిస్తున్నారు. గత సంవత్సరం మూడు హాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించిన రెహమాన్ ఈ సంవత్సరం ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘మహమ్మద్’ చిత్రానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ అరబిక్‌లో వుంటాయి. ఇరాన్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ‘మహమ్మద్’ చిత్రానికి మజిద్ మజిదీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు విన్నవారంతా ఈ సంవత్సరం రెహమాన్‌కి మరో ఆస్కార్ అవార్డు గ్యారెంటీ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అరబిక్‌లో రాని ఓ కొత్త తరహా సంగీతాన్ని రెహమాన్ ఈ చిత్రం ద్వారా ఇరాన్‌లో పరిచయం చేశాడట. భారతదేశానికి మొదటి ఆస్కార్‌తో శ్రీకారం చుట్టిన ఎ.ఆర్.రెహమాన్ మరో ఆస్కార్‌ని తీసుకు రావాలని ఆశిద్దాం.