తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ‘బాహుబలి’ పాటల వేడుకని జరిపేందుకు ఏర్పాట్లు చేసింది ఆ చిత్రబృందం. అతి పెద్ద సినీ వేడుక ఇదే అవుతుందేమో అని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. రాజమౌళి తీసిన ‘బాహుబలి’కి భారీ హైప్ క్రియేట్ కావడంతో ఆ సినిమాకి సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా ప్రేక్షకులు ఆసక్తిగా తెలుసుకొంటున్నారు. ఇక పాటల వేడుక అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్‌కి సంబంధించిన సినిమా వేడుక ఇది. యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకొన్న ప్రభాస్‌కి బోలెడంత అభిమానులున్నారు. వాళ్లంతా ఈరోజు సాయంత్రం తిరుపతిలో జరగనున్న ఆడియో వేడుకలో పాల్గొని కదం తొక్కేందుకు రెడీగా ఉన్నారు. భారీ స్థాయిలో జనం వస్తారు కాబట్టి అందుకు తగ్గట్టుగానే కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం.
అయితే రాజమౌళి ముందస్తుగా ఓ హెచ్చరిక చేశాడు. పిల్లలు, వృద్ధులు వేడుకకి రాకూడదని, వాళ్లను ఎవ్వరూ తీసుకురావద్దని స్పష్టం చేశారు. తొక్కిసలాట జరిగితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఆయన ఈ విన్నపం చేశాడు. అలాగే బాహుబలి ఆడియో పాస్‌ల్ని డబ్బులకి అమ్ముతున్నారన్న విషయం రాజమౌళి దృష్టికి వచ్చింది. వాటిపై కూడా రాజమౌళి ఓ ప్రకటన చేశాడు. అలా అమ్మేటువంటి పాస్‌లు డూప్లికేట్ అయ్యుంటాయనీ, పాస్‌లు ఎవ్వరూ కొనుక్కోవద్దని, ప్రభాస్ అభిమానుల దగ్గర ఉన్న పాస్‌ల్ని ఉచితంగా తీసుకోండని ఆయన పిలుపునిచ్చారు.