సినిమాల మీద సినిమాలు వదలబోతున్నాడు నారా రోహిత్. ‘అసుర’ హిట్టయింది కాబట్టి రేపోమాపో శంకర విడుదల కావొచ్చు. అలాగే ‘పండగలా వచ్చాడు’ కూడా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆయా సినిమాలన్నీ సిద్ధమయ్యాయి కాబట్టి వెంట వెంటనే విడుదల చేయబోతున్నాడు. కొత్త సినిమాల్ని ప్రారంభించడంలోనూ మనోడు అదే జోరును కనబరుస్తున్నాడు. మొన్ననే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా మొదలుపెట్టాడు. నిన్న ‘గుండెల్లో గోదారి’ ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమనీ, మురుగదాస్ కథ అందించాడని చిత్రబృందం ప్రకటన విడుదల చేసింది.
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న మురుగదాస్ కథని అందించడమేంటి? అది నారా రోహిత్‌కి ఇవ్వడమేంటి? అని అంతా ఆశ్చర్యపోయారు. తీరా లోతుగా వివరాలు సేకరిస్తే తమిళంలో విజయవంతమైన ‘మాన్ కరాటే’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది. అక్కడ శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రానికి మురుగదాస్ కథని అందించడంతో పాటు, స్వయంగా నిర్మించాడు. నారా రోహిత్‌కి తగ్గట్టుగా ఆ కథ ఉందని భావించడంతో ‘జోరు’ నిర్మాతలు రైట్స్ కొని తెలుగులో సినిమా మొదలుపెట్టారు. అదన్నమాట సంగతి. అయితే ఆ వివరాలేవీ చెప్పకుండా మురుగదాస్ కథతో నారా రోహిత్ సినిమా అని గొప్పగా ప్రకటించారు నిర్మాతలు. రీమేక్ సినిమా చేస్తున్నామని చెప్పడానికి అంత నామోషీ ఎందుకోమరి!!