సతీష్ బాబు, పావని జంటగా ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై, బేబీ నిత్యసాయి సమర్పణలో కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో, శాంతిశ్రీ మండవ నిర్మిస్తున్న సినిమా 'కళింగ'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయిబాబా మందిరంలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సి.కళ్యాన్ క్లాప్ కొట్టగా, ఈనాడు మధు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. వెంకటేశ్వరావు, లక్ష్మీనారాయణ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరావు మాట్లాడుతూ "అధ్బుతమైన ఫ్యామిలీ కథకు, మంచి యాక్షన్ ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కామెడీ కూడా ఉంటుంది. సతీష్ ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించాడు. హీరోగా తొలిసారి 'కళింగ' చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. రెండు షెడ్యూల్లో సినిమాను కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. మొదటి షెడ్యూల్ పది రోజులు, రెండో షెడ్యూల్ ముప్పై రోజులు ఉంటుంది. ప్రస్తుతం భద్రాచలంలో సాంగ్స్ షూటింగ్ జరుపుకొంటున్నాం. సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయి" అని చెప్పారు.
హీరో సతీష్ మాట్లాడుతూ "రఘుపతి వెంకటరత్నం నాయుడు సినిమా ఈ బ్యానర్ లోనే చేసాం. ఎన్నో మంచి హిట్ చిత్రాలను తెరకెక్కించిన నాగేశ్వరావు గారి దర్శకత్వంలో హీరోగా పరిచయమవ్వడం ఆనందంగా ఉంది. భద్రాచలం, హైదరాబాద్, వికారాబాద్ అడవులలో షూటింగ్ నిర్వహించనున్నాం" అని చెప్పారు.