అభినయ్ దర్శన్, మధుమిత జంటగా సుష్మా దర్శన్ క్రియేషన్స్ పతాకంపై సత్యనారాయణ నిర్మిస్తున్న 'ఫిదా' చిత్రం ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కన్నా లక్ష్మీనారాయణ క్లాప్ ను ఇవ్వగా, ఏ.పి.ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ మెంబర్ పద్మిని కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కాదంబరి కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ "డైరెక్టర్ గారు కథ చెప్పగానే మంచి స్టొరీ అనిపించి నిర్మాణ రంగంలో అడుగుపెట్టాను. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయం కొన్ని రోజుల్లో తెలియబరుస్తాం" అని చెప్పారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ "అభినయ్ మంచి ఈజ్ ఉన్న కుర్రాడు. ఫిదా సినిమాతో అందరిని ఫిదా అయ్యేలా చేస్తాడని భావిస్తున్నాను. సినిమాపై సెన్సేషన్ క్రియేట్ చేయడానికే డైరెక్టర్ ఎవరనే విష్యం తెలియనివ్వట్లేదు. గతంలో కూడా ఇలా డైరెక్టర్ పేరు చెప్పకుండా తీసిన సినిమా ఉంది. అది మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
హీరోయిన్ మధుమిత మాట్లాడుతూ "ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ సినిమాలో నేను కాలేజ్ కు వెళ్ళే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు.
అభినయ్ దర్శన్ మాట్లాడుతూ "మిస్డ్ కాల్ అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టాను. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇది నా రెండవ సినిమా. ఇదొక లవ్ స్త్రోరి. ఇలాంటి కథతో తెలుగులో సినిమాలు రాలేదు. రివర్స్ స్క్రీన్ ప్లే డ్రామా ఉంటుంది. మరో పది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. 35 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని నాలుగు నెలల్లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం" అని చెప్పారు.
సతీష్ శుక్ల మాట్లాడుతూ "తెలుగులో ఇది నా మొదటి సినిమా. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాను. ఖచ్చితంగా సినిమా మంచి హిట్ అవుతుంది" అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పద్మిని, చక్రవర్తి ఘనపాటి తదితరులు పాల్గొన్నారు.