డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'రుద్రమదేవి' చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ చిత్రంగా తెరకెక్కిన 'రుద్రమదేవి' గురించి ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ. 70 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాను తీసి గుణశేఖర్ భారీ రిస్క్ తీసుకున్న వ్యక్తిగా ప్రచారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా భారీ రిస్క్‌తో కూడుకున్నది కావడం విశేషం.
రవితేజ కెరియర్‌లో 'కిక్' ఓ మైలురాయిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వస్తున్న 'కిక్-2'పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించకపోయినప్పటికీ జూలై మొదటివారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో వారానికి జక్కన్న ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' జూలై 10న విడుదల కానుంది. ఈ లెక్కన్న 'రుద్రమదేవి' జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తే వసూళ్లను రాబట్టుకోవడానికి ఈ సినిమాకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ వారం గ్యాప్‌లో రూ. 70 కోట్లను ఈ సినిమా కలెక్ట్ చేయగలుగుతందా అనేది అనుమానమే. ఈ సినిమా వచ్చే సమయానికి వేసవి సెలవులు కూడా అయిపోతుండటంతో భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఈ సినిమా మిగిలిన రెండు సినిమాలను మించి విజయవంతమైతే కలెక్షన్లు వాపస్ వచ్చే అవకాశముంది. రెండు వారాల వ్యవధిలో మూడు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పెద్ద రిస్క్ అని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. మరి గుణ ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.