ఆన్‌లైన్‌లో ‘బాహుబలి’ ట్రైలర్ మళ్లీ సందడి చేస్తోంది. కొన్ని కారణాలవల్ల నిన్న యూ ట్యూబ్ ఆన్‌లైన్ నుంచి ‘బాహుబలి’ ట్రైలర్‌ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే చిత్రబృందం మళ్లీ యూ ట్యూబ్‌తో సంప్రదింపులు జరిపి ట్రైలర్‌ని తిరిగి తీసుకొచ్చింది. కొన్ని నిమిషాల క్రితమే మళ్లీ యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఒరిజినల్ ట్రైలర్ వ్యూస్‌ని పెంచుకొంటోంది.
విడుదలైన కొన్ని గంటల్లోనే సంచలనానికి తెరతీసిందీ ట్రైలర్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటంతో ఒక్క రోజులోనే తెలుగు, హిందీ భాషల్లో మిలియన్ మార్క్ వ్యూస్‌ని సొంతం చేసుకొంది. అయితే అక్కడే కొద్దిమంది చేసిన స్పామ్ వ్యవహారాలతో ‘బాహుబలి’ ట్రైలర్‌ని యూట్యూబ్ ఆన్‌లైన్ నుంచి తొలగించేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు కంగారుపడిపోయారు. సినిమా విడుదల తేదీ వరకు వాళ్లు పదే పదే చూసుకోవల్సింది ఆ ట్రైలర్‌నే. అలాంటిది ఉన్నట్టుంది ట్రైలర్ ఆన్‌లైన్‌లో కనిపించకపోయేసరికి ఏం జరిగిందో అంటూ అయోమయానికి గురయ్యారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది. అయితే ఇప్పుడు `బాహుబలి` సందడి చెన్నైకి షిఫ్ట్ అయ్యింది. మొన్న హిందీలో కరణ్ జోహార్ తో కలిసి ట్రైలర్ విడుదల చేశారు. తెలుగులోనూ మాంచి సందడి మధ్య ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు తమిళ్ వర్షన్ ట్రైలర్ని అట్టహాసంగా విడుదల చేసేందుకు `బాహుబలి` బృందం చెన్నైలో ఏర్పాట్లు చేస్తోంది. తమిళ్ కథానాయకుడు సూర్య చేతులమీదుగా ట్రైలర్ని విడుదల చేస్తున్నారు. ప్రభాస్, రానా కూడా నిన్ననే చెన్నై చేరుకున్నారు.