Advertisementt

ఎవరూ అధిరోహించలేని శిఖరం అతను.!

Wed 03rd Jun 2015 12:29 AM
music director ilaiyaraja,ilaiyaraja birthday on 2nd june  ఎవరూ అధిరోహించలేని శిఖరం అతను.!
ఎవరూ అధిరోహించలేని శిఖరం అతను.!
Advertisement

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు వుండడు, సినిమా ప్రేమికుడు వుండడు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. 1970కి ముందు శ్రోతలు మధురమైన సంగీతాన్ని విన్నారు. 1970 ఎంటర్‌ అయిన తర్వాత సినిమా సంగీతం ధోరణి కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. మధురం స్థానంలో కొంత మాస్‌ మసాలా కూడా తోడైంది. కమర్షియల్‌ సినిమాలు, కమర్షియల్‌ పాటల ప్రాధాన్యత పెరిగింది. 1970 తర్వాత ఓ ఐదారు సంవత్సరాలు ఒకే తరహా పాటలు వినిపించాయి. ఆ టైమ్‌లోనే ఇళయరాజా అనే ఓ కొత్త సంగీత తరంగం సంగీత ప్రేమికుల వీనులకు తాకింది. తెలుగులో ‘భద్రకాళి’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఇళయరాజా మెల్ల మెల్లగా తన విభిన్నమైన వాయిద్యాలతో కొత్త తరహా స్వరాలను సంగీతాభిమానులకు స్లో పాయిజన్‌లా ఎక్కించడం మొదలు పెట్టాడు. 

మాస్‌ పాటైనా, మెలోడీ సాంగ్‌ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్‌ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు వుండేవి.  శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్‌ మ్యూజిక్‌ని లింక్‌ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇదీ, పాటలంటే ఇవీ అని అందరిచేతా అనిపించారు. 1980 దశకంలో ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునేంతగా పాటలు వినేవారు. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలనూ మ్యూజికల్‌ హిట్స్‌ చేసిన ఘనత ఇళయరాజాది. అలాగే ఎ.ఆర్‌.రెహమాన్‌ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్‌ చేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్‌లో వచ్చిన గీతాంజలి పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. కమల్‌హాసన్‌, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా చెప్పుకోవచ్చు. 

సినిమా సంగీతమే కాకుండా శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం మేళవించి  ‘హౌ టు నేమ్‌ ఇట్‌’, ‘నథింగ్‌ బట్‌ విండ్‌’ వంటి ఆల్బమ్స్‌తో విదేశీయులను కూడా మెప్పించారు ఇళయరాజా. 2000 సంవత్సరం వరకు తన సంగీతంతో అందర్నీ అలరించిన ఇళయరాజా ఆ తర్వాత అడపా దడపా మాత్రమే సినిమాలకు మ్యూజిక్‌ చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌గా అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకు భారతదేశంలోని వివిధ భాషల్లో 4,000కు పైగా పాటలతో 800కి పైగా సినిమాలు చేసిన ఇళయరాజా మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఇప్పటివరకు ‘సంగీతజ్ఞాని’గా ఇళయరాజాను తప్ప ఎవరినీ సంగీతాభిమానులు ఊహించుకోలేరు. అలాంటి ఖ్యాతినీ, ఎవరూ అధిరోహించలేని ఉన్నతమైన శిఖరంగా పేరు తెచ్చుకున్న ఇళయరాజా పుట్టినరోజు ఈరోజు(జూన్‌ 2). ఈ సందర్భంగా సంగీతజ్ఞాని ఇళయరాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ‘సినీజోష్‌’. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement